07:25 PM
శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా పడింది
సమావేశాలను నిరవధికంగా స్పీకర్ వాయిదా వేశారు. ఈనెల 9 నుంచి నేటి వరకు అసెంబ్లీ సమావేశాలు సాగింది. మొత్తం 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి. అసెంబ్లీలో సభ్యులు చేసిన ప్రసంగాల సంఖ్య- 19. అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చల సంఖ్య- 2.
07:00 PM
యూపీఏ వల్లే బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ ఇచ్చింది అని అంటున్నారు : జగదీశ్‌రెడ్డి
బొగ్గు ధరలు, గ్రీన్ సెస్, రవాణా ఛార్జీలు పెరగడం వల్ల డిస్కమ్‌లపై భారం పడిందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. యూపీఏ వల్లే బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ ఇచ్చింది అని అంటున్నారు మరి పక్క రాష్ట్రాల్లో ఎందుకు 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. పేదలకు ఎప్పటినుంచి ఉచిత విద్యుత్ ఇస్తారని ప్రశ్నించారు.
06:48 PM
24 గంటల కరెంట్ అవసరం లేదని కొందరు కాంగ్రెస్ నేతలు కూడా అన్నారు : జగదీశ్‌రెడ్డి
వానాకాలం ప్రారంభంలో విద్యుత్ కోసం రైతులు కొన్ని చోట్ల ఆందోళన చేశారని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని తెలిపారు. 24 గంటల కరెంట్ అవసరం లేదని కొందరు కాంగ్రెస్ నేతలు కూడా అన్నారని చెప్పారు.
06:44 PM
రాష్ట్రం ఏర్పడేనాటిన మన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7వేల మెగావాట్లు: జగదీశ్‌రెడ్డి
రాష్ట్రం ఏర్పడేనాటికి మన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7వేల మెగావాట్ల ఉందని జగదీశ్‌రెడ్డి అన్నారు. 2014 నాటికి డిస్కమ్‌ల అప్పు రూ.44 వేల కోట్లు ఉందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడేనాటికి పరిశ్రమలకు వారానికి 2రోజులు పవర్ హాలిడే ఉండేదని అన్నారు.
06:36 PM
విద్యుత్ సంస్థల ఆస్తులు పెరిగాయనేది అవాస్తవం: భట్టి
ఆస్తులు సృష్టితే డిస్కమ్‌ల పరపతి రేటింగ్ ఎందుకు తగ్గిందని భట్టి ప్రశ్నించారు. విద్యుత్ సంస్థల ఆస్తులు పెరిగాయనేది అవాస్తవమని తెెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన విద్యుత్ సంస్థల అప్పులు రూ.81 వేల కోట్లుగా తేల్చి చెప్పారు.
06:24 PM
ప్రజలకు వాస్తవాలు చెప్పాలని నిర్ణయించుకున్నాం: భట్టి విక్రమార్క
ప్రజలకు వాస్తవాలు చెప్పాలని నిర్ణయించుకున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ కనెక్షన్లు 19.03 లక్షలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ కనెక్షన్లు దాదాపు 28 లక్షలు ఉన్నాయని అన్నారు. ప్రాజెక్టులు, కాలువల నుంచి నీళ్లు వస్తే ఎవరైనా కొత్త బోర్లు వేసుకుంటారా అని ప్రశ్నించారు.
06:20 PM
ప్రభుత్వ అప్పులు చూస్తే గుండెలు పగిలిపోతున్నాయి: భట్టి
ప్రాజెక్టులు కట్టి, విద్యుత్ తెచ్చి అప్పులు చేశామంటే అర్థం ఉందని భట్టి తెలిపారు. ప్రభుత్వ అప్పులు చూస్తే గుండెలు పగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్కమ్‌లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.32,490 కోట్లని తెలిపారు. శ్వేతపత్రం పెట్టి వాస్తవాలు చెబుతామంటే చర్చ లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్‌శాఖపై రూ.1,14,057 కోట్ల అప్పులు ఉన్నాయని స్పష్టం చేశారు.
06:18 PM
గత పాలకుల వల్ల విద్యుత్‌రంగంలోని సంస్థలకు రూ.81,560 కోట్లు అప్పులయ్యాయి: భట్టి
యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందంతో కలిపి వచ్చిన విద్యుత్ 1000 మెగావాట్లని భట్టి తెలిపారు. గత పాలకుల వల్ల విద్యుత్‌రంగంలోని సంస్థలకు రూ.81,560 కోట్లు అప్పులయ్యాయని అన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా విపరీతమైన అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
06:11 PM
గత ప్రభుత్వం బొగ్గు లభించే ప్రాంతాల్లో పవర్‌ప్లాంట్‌లు పెట్టలేదు: భట్టి
గత ప్రభుత్వం బొగ్గు లభించే ప్రాంతాల్లో పవర్‌ప్లాంట్‌లు పెట్టలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి పవర్‌ప్లాంట్ ఆలస్యం కావడం వల్ల అదనంగా రూ.10 వేల కోట్ల భారం పెరిగిందని అన్నారు. యాదాద్రి, భద్రాద్రి కాకుండా బీఆర్ఎస్ ఏవైనా కొత్త ప్రాజెక్టులు నిర్మించింద అని భట్టి ప్రశ్నించారు. మాకు కనబడకుండా బీఆర్ఎస్ కొత్తవి కట్టిందా అని నిలదీశారు.
06:01 PM
జెన్ కో థర్మల్, కొత్తగూడెం, రామగుండం, కాకతీయ విద్యుత్ కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని మంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేశారు. విభజన తర్వాత తెలంగాణ నష్టపోకుండా సోనియాగాంధీ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు.
05:59 PM
యూపీఏ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్లే విద్యుత్ సమస్య తీరిందని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. యుపీఏ ముందు చూపు వల్లే కొన్ని రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఏర్పడిందని, కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విద్యుత్ సంస్థలే వల్లే తెరాస విద్యుత్ ఇవ్వగలిగిందని చెప్పారు.
05:55 PM
విద్యుత్ విషయంలో వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలని శ్వేతపత్రం విడుదల చేశామని భట్టి అన్నారు. విద్యుత్ విషయంలో పలువురు సభ్యులు విలువైన సలహాలు ఇచ్చారని తెలిపారు. డిస్కమ్‌ల నష్టాలకు కారణం ఎవరో వివరించామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఏ ప్రాజెక్టు ఎవరి కాలంలో నిర్మించారో ప్రజలకు తెలుసని అన్నారు.
05:48 PM
అన్ని పార్టీల కోరిక మేరకు వైఎస్‌ఆర్ ఉచిత విద్యుత్ తీసుకువచ్చారని జూపల్లి కృష్ణారావు గుర్తు చేశారువైఎస్‌ఆర్ అధికారంలోకి రాగానే రూ.1100 కోట్ల విద్యుత్ బకాయిలు రద్దు చేశారని తెలిపారు. గడిచిన పదేళ్లలో కూడా విద్యుదాఘాతంతో వందల మంది రైతులు చనిపోయారని పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగుకు ఉచిత విద్యుత్ పేటెంట్ ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీదేనని జూపల్లి అన్నారు.
05:38 PM
సింగరేణికి కొత్త గనులు ఇవ్వట్లేదని కూనంనేని సాంబశివరావు అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రూ.10 నుంచి 12 వేల కోట్లు ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. విద్యుత్‌రంగంలో నష్టాలు ఎలా పూడ్చుకోవాలో ఆలోచించాలని సూచించారు. విద్యుత్ అందించే క్రమంలో కేసీఆర్ నిర్ణయాల్లో కొన్ని పొరపాట్లు జరిగాయని అన్నారు. కేసీఆర్ నిర్ణయాల్లో పొరపాట్ల వల్లే నష్టాలు వచ్చాయని ఆరోపించారు. విద్యుత్ సంస్థల నష్టాలు ఎలా పూడ్చాలో ఆలోచించాలని కూనంనేని అన్నారు. భద్రాద్రి ప్రాజెక్టు నిర్మాణం హడావుడిలో జరిగిందని పేర్కొన్నారు. భద్రాద్రి ప్రాజెక్టు నిర్మాణం సరైన ఎత్తులో నిర్మించలేదని ఆరోపించారు. సరైన ఎత్తులో లేకపోవడం వల్ల గతంలో కొంత ముంపునకు గురైందని, పోలవరం పూర్తయితే భద్రాద్రి ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్స్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఆర్టిజన్స్ అనేది బ్రిటీష్ వాళ్లు అమలు చేసిన వెట్టిచాకిరి విధానమని కూనంనేని అన్నారు. ఆర్టిజన్స్ ఉద్యోగులను కూడా సాధారణ ఉద్యోగులుగా మార్చాలని, సింగరేణి, జెన్ కో సంస్థలను బతికించుకోవాలని కూనంనేని అభిప్రాయపడ్డారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో సోలార్ పవర్ వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
05:15 PM
ఎజెండా గురించి కాకుండా ఇతర అంశాల్లోకి వెళ్లడం చాలా బాధాకరమని కూనంనేని అన్నారు. సభలో మాలాంటి వాళ్లు మాట్లాడకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయని, సభా నిర్వహణ విధానంలో మార్పు రావాలని ఆయన కోరారు. ఉచిత విద్యుత్‌ను విజయభాస్కర్‌రెడ్డి ప్రవేశపెట్టారని చెప్పారు. 5 హెచ్‌పీ విద్యుత్‌ను ఎన్టీఆర్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ కోసం ఉద్యమం చేశారని తెలిపారు. కమ్యూనిస్టుల ఉద్యమం వల్లే విద్యుత్ టారిఫ్‌ను పెంచే ధైర్యం చేయట్లేదని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌ను ముందుకు తీసుకెళ్లింది వైఎస్, కేసీఆర్ ఉచిత విద్యుత్‌ను సాధ్యం చేయగలిగారని అన్నారు. చివరకు కోతలు లేని విద్యుత్‌ను మనం సాధించుకోగలిగామని చెప్పారు. కేటీపీఎస్‌ను మంజూరు చేసింది కిరణ్‌కుమార్ అని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కేటీపీఎస్ విస్తరణ ప్రాజెక్టు పూర్తయ్యిందని తెలిపారు. భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టులు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే చేపట్టారని చెప్పారు.
05:09 PM
పదే పదే విద్యుత్ చౌర్యం గురించి మాట్లాడుతున్నారని అక్బరుద్దీన్ అన్నారు. పాతబస్తీలో విద్యుత్ చౌర్యం అంటూ బీజేపీ మాట్లాడుతోందని చెప్పారు. సీఎం విద్యుత్ బకాయిల గురించి మాట్లాడుతున్నారా, విద్యుత్ చౌర్యం గురించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. పాతబస్తీలో విద్యుత్ చౌర్యం అన్నదే లేదని అక్బరుద్దీన్ అన్నారు. మేం ఏ పార్టీకి మైనార్టీ సెల్ కాదని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో గతంలోనూ పోటీ చేశాం, మొన్న కూడా పోటీ చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ తరపున ముస్లిం పోటీ చేసినప్పుడు మేం కూడా చేస్తాం కదా అని అన్నారు. కార్వాన్‌లో కాంగ్రెస్ తరపున ముస్లిం పోటీ చేయలేదా అని ప్రశ్నించారు.
05:06 PM
శ్వేతపత్రం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతకానితనాన్ని బయటపెట్టుకుందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పడే నాటికి 2,700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందని చెప్పారు. నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. విజయవాడ, కడపలో బొగ్గు లేకుండానే కాంగ్రెస్ సర్కారు విద్యుత్ ప్రాజెక్టులు కట్టిందని తెలిపారు. బొగ్గు, నీరు లేని ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులు ఎందుకు పెడతారని పోరాడామని గుర్తు చేశారు. నేదునూరు, శంకర్‌పల్లి ప్రాజెక్టులకు కేంద్రం గ్యాస్ కేటాయించలేదని అన్నారు. గ్యాస్ కేటాయించకపోవడం వల్లే నేదునూరు, శంకర్‌పల్లి ప్రాజెక్టులు చేపట్టలేకపోయాని కేటీఆర్ పేర్కొన్నారు. నేదునూరు, శంకర్‌పల్లిలో గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరారు.
05:03 PM
సిద్దిపేట ప్రజలు కరెంటు బిల్లులు కట్టలేదని సీఎం చెప్పలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పోడియం వద్ద గొడవ జరిగినా ఆనాడు విభజన బిల్లు తెచ్చారని గుర్తు చేశారు.
04:58 PM
సిద్దిపేట, గజ్వేల్, పాతబస్తీలో కాంగ్రెస్ గెలవలేదని సీఎం అక్కసు వెళ్లగక్కారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట, గజ్వేల్‌లో ప్రజలు కరెంటు బిల్లులు కట్టలేదనడం అవాస్తవమని చెప్పారు. తెలంగాణ ఇస్తామంటేనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని గుర్తు చేశారు. జై తెలంగాణ అంటేనే తెదేపాతో పొత్తు పెట్టుకున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు. మేం ఎవరితో పొత్తు పెట్టుకున్నా తెలంగాణ కోసమేనని చెప్పారు. రేవంత్ రెడ్డి పదవుల కోసమే పార్టీలు మారారని అన్నారు.
04:50 PM
విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ అగ్రస్థానాల్లో ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలో విద్యుత్ శ్వేతపత్రంపై చర్చలో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, అక్బరుద్దీన్ మధ్య మాటల యుద్ధం వాడీవేడీగా సాగింది. పాతబస్తీలో విద్యుత్ చౌర్యం గురించి మాట్లాడుతున్నారా? అని అక్బురుద్దీన్ ప్రశ్నించారు. అక్బరుద్దీన్ విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అజారుద్దీన్, షబ్బీర్ అలీలను ఓడించేందుకు ఎంఐఎం ప్రయత్నించిందని రేవంత్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి అపరిపక్వతతో మాట్లాడుతున్నారని అక్బరుద్దీన్ ఉద్ఘాటించారు
02:09 PM
గత ప్రభుత్వం నియంతృత్వ విధానం అవలంబించింది: ఎమ్మెల్యే వంశీకృష్ణ
గత ప్రభుత్వం నియంతృత్వ విధానం అవలంబించిందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నాారు. తెలంగాణ సమాజాన్ని భయపెట్టే విధానంలో పాలన జరిగిందని పేర్కొన్నారు.
1:58 PM
సభ హుందాతనాన్ని మనం కాపాడుకోవాలి: పోచారం శ్రీనివాసరెడ్డి
సభ హుందాతనాన్ని మనం కాపాడుకోవాలని పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సభలో వ్యక్తిగత దూషణలకు పోవద్దని ఆయన సూచించారు. మీరైనా, మేమైనా, వ్యక్తిగత దూషణలు వద్దని, కొత్తగా సభకు వచ్చేవారికి మార్గదర్శకులుగా ఉందామని పోచారం శ్రీనివాసరెడ్డి వివరించారు.
1:38 PM
విద్యుత్‌ను బీఆర్ఎస్ నేతలే కనుగొన్నట్టు మాట్లాడుతున్నారు : పాయల్ శంకర్
విద్యుత్‌ను బీఆర్ఎస్ నేతలే కనుగొన్నట్టు మాట్లాడుతున్నారని పాయల్ శంకర్ అన్నారు. ప్రభుత్వాని కంటే ముందు విద్యుత్తే లేదన్నట్టు చెప్పుకొస్తున్నారని అన్నారు. ఇలాంటి శ్వేతపత్రాలు ఆరంభంలోనే ఉంటాయని మేం ఊహించలేదన్నారు. విద్యుత్ వ్యవస్థ మెరుగుగా ఉండాల్సిందేనని..ధర్నాలు లేవు కాబట్టే 24 గంటలు ఇచ్చామని జగదీశ్‌రెడ్డి చెబితే సరికాదని తెలిపారు. గత ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇవ్వకుండానే అప్పులు చేసిందని గుర్తు చేశారు. 200 యూనిట్ల కరెంట్ కోసం విద్యుత్ సంస్థలకు రూ.8,820 కోట్లు కావాలని తెలిపారు.కేంద్రం చర్యలు కారణంగానే రాష్ట్రానికి 24 గంటల కరెంట్ వచ్చిందని కేసీఆర్ అన్నారని అన్నారు. బీజేపీను బీఆర్ఎస్ బద్నాం చేస్తుందని ఏపీలో మోటార్లకు మీటర్లు పెట్టినా ఉచిత విద్యుత్ ఇస్తోందని తెలియజేశారు.200 యూనిట్ల కరెంట్ ఎప్పటి నుంచి ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు.
1:26 PM
డిస్కమ్‌లను అప్పుల ఊబిలో ముంచారు : రాజగోపాల్‌రెడ్డి
డిస్కమ్‌లను అప్పటి ప్రభుత్వం అప్పుల ఊబిలో ముంచారని రాజగోపాల్ రెడ్డి విమర్మించారు. తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా ఎక్కువ ధరకు కొన్నారని అన్నారు. బొగ్గు గనులు అందుబాటులో లేని మిర్యాలగూడలో ప్లాంట్ పెట్టారని తెలిపారు.
1.16 PM
నేను ప్రజల కోసమే పార్టీలు మారాను: రాజగోపాల్‌రెడ్డి
బీఆర్ఎస్ సభ్యులు ప్రతిసారి పార్టీల మార్పుపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ త్వరలో రాష్ట్రంలో కనుమరుగు కావడం ఖాయమని, ఆ పార్టీ సభ్యులను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అని ఆయన మండిపడ్డారు. వేల కోట్లతో బంగళాలు కట్టి జగదీశ్‌రెడ్డి ఇల్లు ఎలా కట్టారని ప్రశ్నించారు. తాను ప్రజల కోసమే పార్టీలు మారానని స్పష్టం చేశారు. మాజీ సీఎం వద్ద బీఆర్ఎస్ నేతలు నోరుమెదపకపోవడమే అసలు అనర్థాలకు కారణమని, దయ్యాలు వేదాలు వల్లించినట్టు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
1.06 PM
విద్యుత్ మూడు గంటలు చాలన్న వాళ్లకు రైతుల సమస్యలు ఏం తెలుస్తాయి: జగదీశ్‌రెడ్డి
సీఎం చెప్పిన మూడు అంశాలతో పాటు కోమటిరెడ్డి ఆరోపణలపైనా విచారణ జరిపించాలి. మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలపై కూడా న్యాయవిచారణ జరిపించాలి:. న్యాయ విచారణలను మేం స్వాగతిస్తున్నాం. ప్రాజెక్టుల విషయంలో దాచి పెట్టడానికి ఏమీ లేదు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఏనాడూ 3 గంటలకు మించి ఇవ్వలేదు. గత 9 ఏళ్లలో ఒక్క రోజైనా రైతు విద్యుత్ కోసం ధర్నా చేశారా? విద్యుత్ మూడు గంటలు చాలన్న వాళ్లకు రైతుల సమస్యలు ఏం తెలుస్తాయి అని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.
12.41 PM
ఆ మూడు ప్రాజెక్టులపై న్యాయవిచారణ జరిపిస్తాం : సీఎం రేవంత్
మూడు అంశాలపై న్యాయవిచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ను నేను స్వీకరిస్తున్నాను. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కోరుకున్నట్టే న్యాయవిచారణ చేయిస్తాం. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలపై న్యాయవిచారణకు ఆదేశిస్తున్నాం. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగింది. భద్రాద్రి పవర్ ప్రాజెక్టుపై న్యాయవిచారణకు ఆదేశిస్తున్నాం. యాదాద్రి ప్రాజెక్టు 8 ఏళ్లయినా పూర్తి కాలేదు. యాదాద్రి ప్రాజెక్టుపై న్యాయవిచారణకు ఆదేశిస్తున్నాం. అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
12.32 PM
ఒప్పందాల వెనుక ఉన్న ఉద్దేశాలు బయటకు రావాలి: రేవంత్‌రెడ్డి
మూడు అంశాలపై న్యాయవిచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ విద్యుత్ అనేది పెద్ద సెంటిమెంట్ అన్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కోరుకున్నట్టే న్యాయవిచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. వాస్తవాలు చెప్పిన ఓ ఉద్యోగి హోదాను గత ప్రభుత్వం తగ్గించిందన్న రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగిని గత ప్రభుత్వం శిక్షించిందని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందని అన్నారు. ఒప్పందాల వెనుక ఉన్న ఉద్దేశాలు బయటకు రావాలని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలపై న్యాయవిచారణకు ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు.
12.24 PM
తెలంగాణ విద్యుత్ రంగ పరిస్థితిపై న్యాయ విచారణకు మేం సిద్ధం : సీఎం రేవంత్
విద్యుత్ రంగ పరిస్థితిపై న్యాయవిచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూడు అంశాలపై న్యాయవిచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వ్యవసాయ విద్యుత్ అనేది పెద్ద సెంటిమెంట్ అని అన్నారు. వాస్తవాలు చెప్పిన ఓ ఉద్యోగి హోదాను గత ప్రభుత్వం తగ్గించిందని ఆరోపించారు.
12.22 PM
నాపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: జగదీశ్‌రెడ్డి
"నాపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. మా హయాంలో అర ఎకరం కూడా ఎండలేదు. విద్యుత్‌పై ధర్నాలు చేసే అవకాశం మేం ఇవ్వలేదు. మా హయాంలో ఒక్క రోజు కూడా పవర్ హాలిడే ఇవ్వలేదు. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికీ అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నంత మాత్రాన మనందరం చెడ్డవాళ్లమా? అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు." అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
12:04 PM
యాదాద్రి ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగింది: మంత్రి కోమటిరెడ్డి
యాదాద్రి ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. 10 వేల కోట్లు జగదీశ్‌రెడ్డి తిన్నారని, టెండర్ పెట్టకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని మంత్రి స్పష్టం చేశారు.
12:01 PM
ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికి నాణ్యమైన విద్యుత్ అందిస్తాం: భట్టి
ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికి నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన, ఉచిత విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు.
11:50 AM
గత ప్రభుత్వం భద్రాద్రి ప్రాజెక్టు మాత్రమే పూర్తి చేసింది: భట్టి విక్రమార్క
తెలంగాణ ఏర్పాడే నాటికి జెన్‌కో స్థాపిత సామర్థ్యం 4,365 మెగావాట్లు ఉన్నట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత ప్రభుత్వం భద్రాద్రి ప్రాజెక్టు మాత్రమే పూర్తి చేసిందని వివరించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.28,673 కోట్లు అని చెప్పారు. రోజువారి మనుగడ కోసమే డిస్కంలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు రూ.వేల కోట్లు డిస్కంలకు బకాయిలు పడ్డాయని భట్టి విక్రమార్క వివరించారు. ట్రూఅప్ ఛార్జీలు చెల్లిస్తామన్న గత ప్రభుత్వం మాట తప్పిందని చెప్పారు. ట్రూఅప్ ఛార్జీలు చెల్లించకపోవడంతో డిస్కంల పరిస్థితి దిగజారిందని భట్టి స్పష్టం చేశారు.
11:32 AM
తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించాం: జగదీశ్‌రెడ్డి
2014 జూన్ 2 నాటికి నాలుగు విద్యుత్ సంస్థల ఆస్తులు రూ.44,434 కోట్లు అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. 2014 జూన్ 2 నాటికి రూ.22,423 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ రంగం ఆస్తుల రూ.1,37,570 కోట్లుగా ఉన్నట్లు జగదీశ్‌రెడ్డి వివరించారు. తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించామని తెలిపారు. తమ పాలనలో విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచామని వివరించారు.
11:28 AM
విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: భట్టి
విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని భట్టి విక్రమార్క అన్నారు. డిస్కంల ద్వారా వచ్చిన నష్టాలు రూ.62,461 కోట్లు అని వెల్లడించారు. 31 అక్టోబర్ 2023 నాటికి రూ. 81,516 కోట్లు అప్పులు ఉన్నాయని భట్టి విక్రమార్క వివరించారు. తెలంగాణ ఏర్పాడే నాటికి జెన్‌కో స్థాపిత సామర్థ్యం 4,365 మెగావాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
11:19 AM
రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది: భట్టి విక్రమార్క
రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా, ఉత్పత్తి గురించి తెలియాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి నమ్మకమైన విద్యుత్ సరఫరానే వెన్నెముక అని చెప్పారు. రవాణా, సమాచార రంగాల మనుగడకు విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవనశైలిని సూచించేది కూడా విద్యుతేనని భట్టి విక్రమార్క వివరించారు. తెలంగాణ వచ్చాక ఉత్పత్తి ప్రారంభించిన విద్యుత్ కేంద్రాలే నాణ్యమైన విద్యుత్ అందించాయని భట్టి పేర్కొన్నారు.
11:08 AM
శాసనసభ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం అసెంబ్లీలో దీనిపై చర్చిస్తున్నారు. అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలు రూ. 81,516 కోట్ల అప్పుల్లో ఉన్నాయని పేర్కొంది.
10:13 AM
రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితిపై అసెంబ్లీలో నేడు స్వల్ప చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం నేడు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. విద్యుత్ సంస్థలు రూ. 81,516 కోట్ల అప్పుల్లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.