Telangana Assembly Sessions 2023 : ఎన్నికల అనంతరం ఏర్పాటైన రాష్ట్ర మూడో శాసనసభ మొదటి సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 9న సమావేశాలు ప్రారంభం కాగా, సభ్యుల ప్రమాణ స్వీకారాలు, సభాపతి ఎన్నిక, ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇప్పటి వరకు జరిగాయి. నిన్న ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ చర్చ జరగనుంది.
Debate Between Two Houses on Governor Tamilisai Speech : శాసనసభతో పాటు మండలిలోనూ చర్చ ఉంటుంది. అసెంబ్లీలో పరిగి శాసనసభ్యుడు రామ్మోహన్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా, చెన్నూరు ఎమ్మెల్యే వివేకానంద బలపరుస్తారు. మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరుస్తారు. గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Governor Tamilisai Soundara Rajan) ప్రసంగంలో తీవ్రంగా విమర్శించారు. అప్పులు భారీగా పెరిగాయని, వ్యవస్థలను దెబ్బ తీశారని ఆమె ఆరోపించారు.
తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం
చట్టసభల్లో జరుగుతున్న మొదటి చర్చపై నెలకొన్న ప్రాధాన్యత : ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగానికి, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఎలా సాగుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ గెలుపు అనంతరం కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చట్టసభల్లో జరుగుతున్న మొదటి చర్చకు ప్రాధాన్యం నెలకొంది. గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపై భారత్ రాష్ట్ర సమితి సభా వేదికగా ఎలా స్పందించనుంది, దానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం ఎలా ఉండనుంది అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
వాయిదా పడనున్న ఉభయసభలు : ప్రతిపక్షం ఏ మేరకు పాలక పక్షాన్ని ప్రశ్నించనుంది, దాన్ని అధికారపక్షం ఏ మేరకు ఎదుర్కొంటుందన్నది చూడాలి. మండలిలో భారత్ రాష్ట్ర సమితికి మెజార్టీ సభ్యులు ఉన్న తరుణంలో, అక్కడ చర్చ, ప్రభుత్వ సమాధానం ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తి రేపుతోంది. చర్చ, ప్రభుత్వ సమాధానం అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. శ్వేతపత్రాలకు సంబంధించి చట్ట సభల్లో చర్చించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తే, కొన్ని రోజుల్లోనే మరోసారి సమావేశాలు నిర్వహించవచ్చని అంటున్నారు.
తెలంగాణలో కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కార్ - తొలి అడుగులు ఎటువైపో మరి
ఉభయ సభలనుద్దేశించి శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో ప్రసంగం ప్రారంభించిన ఆమె, కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. నియంతృత్వ పోకడల నుంచి రాష్ట్రానికి విముక్తి లభించిందని పేర్కొన్నారు. ఎన్నో ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నామని, రైతులు, యువత, మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పారు. ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో విధ్వంసానికి గురైన వ్యవస్థల పునరుద్ధరణే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తమిళిసై సౌందర రాజన్ వివరించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక - సభ్యుల అభినందనలు
ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే అసెంబ్లీ వేదికగా పోరాటమే - బీజేపీ ఎమ్మెల్యేల హెచ్చరిక