Telangana Assembly Elections Campaign 2023 : రాష్ట్రంలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణా ప్రారంభమైంది. తొలిరోజే 100 మంది వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ కోసం కొందరు, మరో ఛాన్స్ కోసం మరికొందరు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జనాల్లోనే ఉంటూ ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ముఖ్య నేతలతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. అదే సమయంలో అభ్యర్థులు, అభ్యర్థిత్వాలు ఖరారైన నేతలు కార్యకర్తలు, తమ అనుచరులతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ.. ఇంటింటికీ తిరుగుతున్నారు.
తెలంగాణలో హోరెత్తుతున్న ప్రచారం పల్లెలు, పట్టణాల్లో రాజకీయ కోలాహలం
Telangana Labour in Election Campaign 2023 : ఇలా గ్రామాల్లో వాడవాడలా తిరగడానికి ప్రతి పార్టీ తరఫున రోజుకు కనీసం 50 మందికి తగ్గకుండా కూలీలను జమ చేస్తున్నారు. వారికి రోజు కూలీ కింద పార్టీలు పోటాపోటీగా డబ్బులు చెల్లిస్తున్నాయి. ఒక రోజు మొత్తం ప్రచారానికి వస్తే ఒక్కొక్కరికి రూ.500, భోజనం, మినరల్ వాటర్, మజ్జిగ ప్యాకెట్లు, ప్రచారం ముగిశాక మద్యం అందజేస్తున్నారు. ముందుండి నినాదాలిస్తూ ప్రచారాన్ని సమన్వయం చేసే యువకులకైతే రోజుకు రూ.1000 దాకా అప్పజెబుతున్నారు. దాంతో వ్యవసాయ, నిర్మాణ రంగాలతో పాటు ఇతర పనులకు కూలీల కొరత మొదలైంది.
ప్రపంచంలో అతిపెద్ద అవినీతి ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలిచిపోనుంది : బీజేపీ నేతలు
Telangana Leaders Hire Labourer For Campaign : పల్లెల్లో ప్రస్తుతం వానాకాలం వరి కోతలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల వరి కోత యంత్రాలు వాడుతున్నా.. ధాన్యం తరలించడానికి, బస్తాల్లో నింపడానికి, కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడానికి కూలీలు అవసరం. ఎండుగడ్డి అవసరమైన రైతులు.. వరి కోత యంత్రాలతో కాకుండా కూలీలతో వరి కోత కోసం ప్రయత్నిస్తుంటే ఎవరూ దొరకడం లేదు. ఇతర పంటల కోతలు, మార్కెట్లకు తరలింపు పనులకూ చాలా కష్టంగా ఉందని జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ తదితర జిల్లాల రైతులు తెలిపారు. కూలీలంతా ప్రచారాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఏవైనా పనులు ఉంటే వారిని బతిమాలాల్సి వస్తోందని రైతులు, మేస్త్రీలు వాపోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నెల రోజుల్లో 453 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
గుత్తకు రేటు మాట్లాడుకుంటున్నారు..: రోజుకు రూ.500, భోజనం, సాయంత్రం మద్యం అందజేయడంతో పాటు కొంతమంది నేతల హడావిడి చూసి చాలా గ్రామాల్లో కూలీలు ప్రచారానికి తామూ వస్తామంటూ గుత్తకు రేటు మాట్లాడుకుంటున్నారు. 'ఓ ఫ్యామిలీలో మొత్తం 8 మంది సభ్యులున్నారు. సొంత వాహనమూ ఉంది. దీంతో ఏ పార్టీ మీటింగ్ జరిగినా.. వారంతా రావడానికి స్థానిక నేతలతో రూ.10 వేలకు బేరం మాట్లాడుకుంటున్నారు. వారి బండిలోనే సమావేశానికి వచ్చి వెళుతున్నారు. దీంతో దగ్గరలో ఏ పార్టీ మీటింగ్ జరిగినా ఆరోజు ఆ ఇంటికి రూ.10 వేలు పోతున్నాయి' అని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ తెలిపారు.
బహిరంగ సభ ఉంటే అంతే సంగతులు..: ప్రధాన నేతలు వచ్చినప్పుడు.. పెద్ద గ్రామాల్లో మీటింగులు, పట్టణాల్లో బహిరంగ సభలు పెడుతున్నారు. వీటికి కార్లు, బస్సులు, లారీలు, డీసీఎంలలో జనాలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. సాయంత్రం సభ ఉందంటే.. పొద్దున నుంచే అక్కడికి వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. దీంతో దగ్గరలో ఎక్కడైనా బహిరంగ సభ ఉందంటే.. ఇక ఆరోజు గ్రామాల్లో పనులకు ఎవరూ రావడం లేదని రైతులు వాపోయారు.