Telangana Assembly Elections 2023 : 115 నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్ ప్రచారంలో ముందు వరుసలో దూసుకెళ్తుండగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలూ జోరు పెంచాయి. తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులతో పాటు పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలను ఇటీవల పరిష్కరించిన బీఆర్‌ఎస్ హ్యాట్రిక్‌పై ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటీవల ప్రకటించిన 6 గ్యారంటీలతో తమపై ప్రజలకు నమ్మకం పెరిగిందని, ఈ ఎన్నికల్లో తమను ఆశీర్వదిస్తారని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొంత స్తబ్దుగా ఉన్న భారతీయ జనతా పార్టీ.. ఇటీవల కాలంలో మళ్లీ జోరు పెంచింది. 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన పసుపు బోర్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా కృష్ణా జలాల పంపిణీ పునః సమీక్షకు నిర్ణయం తీసుకుంది. దాంతో పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంటోంది.
BRS Manifesto 2023 Release Date : ఈ నెల 15న బీఆర్‌ఎస్ మేనిఫెస్టో.. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్లు
Telangana Assembly Elections Schedule 2023 : సభలు, శంకుస్థాపనలతో బీఆర్‌ఎస్ జోరు..: ఒకే దఫాలో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి టికెట్లు ఇచ్చారు. ఆరు చోట్ల కొత్త వారికి అవకాశం కల్పించారు. నాలుగైదు చోట్ల తప్ప మిగిలిన నియోజక వర్గాల్లో ఎలాంటి సమస్యలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఇటీవల జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. రోజుకు 2, 3 నియోజక వర్గాల్లో పర్యటించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలు.. ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. షెడ్యూల్ రాక ముందే బీఆర్‌ఎస్ దాదాపు ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. అభ్యర్థులంతా నెల రోజులుగా పూర్తిగా తమ తమ నియోజకవర్గాల్లోనే పర్యటిస్తున్నారు. మరోవైపు గత కొన్నిరోజులుగా జ్వరం కారణంగా కార్యక్రమాలకు దూరంగా ఉన్న సీఎం కేసీఆర్.. ఈ నెల 15 నుంచి వరుసగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
6 గ్యారంటీలపై కాంగ్రెస్ ఆశలు..: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. అదే ఊపుతో 3 నెలలుగా దూకుడుగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్పై ప్రజల్లో అసంతృప్తి ఉందని, అది తమకు ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇటీవల ప్రకటించిన 6 గ్యారంటీలు రైతులు, మహిళలు, కార్మికులు, యువత, విద్యార్థులు ఇలా వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలా ఉన్నాయని.. వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. మరోవైపు.. అగ్ర నాయకులంతా టికెట్ల ఖరారు ప్రక్రియలో నిమగ్నం కావడంతో అనుకున్న రీతిలో ప్రచారం జరగడం లేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఏదేమైనా గతంలో తమకు 60 నుంచి 70 చోట్ల మాత్రమే బలమైన అభ్యర్థులు ఉండేవారని, ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు పార్టీలో చేరుతుండటంతో ప్రస్తుతం 90కి పైగా నియోజకవర్గాల్లో తాము గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ చెబుతోంది. ప్రజల్లో అధికార పార్టీపై ఉన్న అసంతృప్తి తమ పార్టీకి లాభిస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది.
ప్రధాని సభలతో వేగం పెంచిన బీజేపీ..: ఓవైపు కర్ణాటక ఫలితాలు, మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో బీజేపీలో కొంత స్తబ్దత నెలకొన్నా.. గత నెల రోజులుగా ప్రచార వేగం పెరిగింది. నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ప్రధాని మోదీతో బహిరంగ సభలు నిర్వహించింది. వెంటనే రాష్ట్ర స్థాయి సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అంతకు ముందు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని 119 మంది శాసనసభ్యులను రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలో పర్యటింపజేసి, పార్టీ పరిస్థితిపై నివేదికలు తెప్పించారు. అదే సమయంలో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొన్ని రోజులుగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నేడు ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రూ.9 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, అనేక పథకాలు ప్రారంభించిందని ఆ పార్టీ నేతలు గట్టిగా ప్రచారం చేస్తున్నారు.