ప్రధాన రాజకీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్, తెరాస బడుగు బలహీనవర్గాలకు చెందిన అభ్యర్థులకు అవకాశం కల్పించనందునే... తెలుగుదేశం పార్టీ నుంచి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా... బరిలో నిలిచానని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ వెల్లడించారు. అన్ని బీసీ కుల సంఘాల నాయకులు, మిత్రుల మద్దతుగా ఉండడం మరింత బలాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు.
హైదరాబాద్ సోమాజిగూడలో బీసీ కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మన ఓటు మనకే వేసుకుందాం పేరుతో.. బీసీ టైమ్స్ మహాత్మా పూలే ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.
తెలుగుదేశం పార్టీ తరపున 1996లో బడుగు బలహీన వర్గాల వాడిగా... నిస్వార్థంతో సేవలందించి కరీంనగర్ ఎంపీగా తాను వేసిన అడుగులతోనే.. ఈ రోజు భాజపా ఎంపీగా బండి సంజయ్, రాష్ట్ర మంత్రిగా గంగుల కమలాకర్‌లు ఉన్నారని రమణ పేర్కొన్నారు. కుల సంఘాల నాయకులు ఎవరైనా తన గురించి చెడుగా చెప్పినట్లయితే తలదించుకుని ఇంటికెళ్లిపోతానని స్పష్టం చేశారు. నిస్వార్థం, నిజాయతీగా అందరి వాడిగా ఉన్నందునే ఈ రోజు ముందుకు వచ్చానని వెల్లడించారు.
ఇదీ చూడండి : తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి: ఎంపీ రేవంత్