Yadlapati Venkatrao No More: తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు (102) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కుమార్తె నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులతో పాటు మంత్రిగానూ వెంకట్రావు పనిచేశారు. రైతు నాయకుడిగానూ ఆయన సేవలందించారు. సంగం డెయిరీకి యడ్లపాటి వెంకట్రావు వ్యవస్థాపక అధ్యక్షుడు.
యడ్లపాటి వెంకట్రావు 1967,1972 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరఫున.. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వేమూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978-80 మధ్యకాలంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. అనంతరం 1983లో తెదేపా చేరారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. యడ్లపాటి వెంకట్రావు మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చంద్రబాబు సంతాపం
రాజకీయ కరువృద్దులు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి మృతికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి రాజకీయ జీవితం ఎంతో ఆదర్శ ప్రాయంగా సాగిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర మంత్రిగా, జడ్పీ ఛైర్మన్‌గా, రాజ్యసభ సభ్యునిగా పని చేసిన యడ్లపాటి... తాను చేపట్టిన పదవులకు వన్నెతెచ్చారని అన్నారు. యడ్లపాటితో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా యడ్లపాటి ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. యడ్లపాటి కుంటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలియజేశారు. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. యడ్లపాటి జీవితం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. మంత్రిగా పార్లమెంట్ సభ్యునిగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. యడ్లపాటి వెంకట్రావు మృతి బాధాకరం ప్రజాప్రతినిధిగా ప్రజలకు నాయకుడిగా పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అచ్చెన్నఅన్నారు. సంఘం డైరీ, జంపని షుగర్ మిల్లుల ఏర్పాటులో వెంకట్రావు కృషి మరువలేనిదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యునిగా, తెలుగు రైతు అధ్యక్షునిగా, గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి విశేష సేవలందించారని గుర్తుచేశారు. వెంకట్రావు మృతి పార్టీకి తీరని లోటు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: