ఏపీ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సభాపతి, మంత్రులు డమ్మీలుగా మారారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం ఎమ్మెల్యేలను కించపరిస్తే వారు ఆనందపడుతున్నారని దుయ్యబట్టారు. నిరసనలు తెలియజేయకుండా నియంత్రిస్తున్నారని... శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
తెదేపా నేతలతో కలసి ఏపీ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన ఆయన...మీడియాపై ఆంక్షలు, జీవో 2430 రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. మీడియాకు సంకెళ్లు వేయడానికే ప్రభుత్వం సిద్ధమైందని... ఏదో విధంగా గుప్పెట్లో పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో టీవీ5, మిగతా ఛానెళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మాజీ స్పీకర్ మరణానికిి కారణమయ్యారు
ఏపీలో 650 మంది తెదేపా కార్యకర్తలపై దాడులు జరిగాయని... ఏపీ మాజీ స్పీకర్ మరణానికి కారణమయ్యారని ధ్వజమెత్తారు. ఇలాంటివి ఉన్మాది చర్యలు కావా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంగ్ల మాధ్యమానికి తెదేపా వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సీఎం జగన్ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సభలో సభ్యులను నియంత్రించడం చట్ట విరుద్ధమని చంద్రబాబు ఉద్ఘాటించారు.