కరకట్ట వద్ద ప్రభుత్వం కూల్చివేయించిన ప్రజావేదిక ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నేతల రాక సమాచారంతో.. పోలీసులను భారీగా మోహరించారు. ప్రజావేదిక వద్దకు వచ్చే 4 రహదారుల్లో... చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తెలుగుదేశం నేతల వాహనాలు మినహా మిగతా వాహనాలను అనుమతించారు. ప్రజావేదిక వద్దకు వెళ్తున్న దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు, రాజేంద్రప్రసాద్, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య సహా ఇతర నేతలను... అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై నేతలు మండిపడ్డారు. పోలీసులు, తెలుగుదేశం నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రజావేదిక ప్రాంగణాన్ని పరిశీలించి.. వెంటనే తిరిగి వచ్చేస్తామని నేతలు వివరించినా... పోలీసులు వినిపించుకోలేదు. వెంట మీడియాను ఎందుకు తీసుకొచ్చారని పోలీసులు ప్రశ్నించారు. అధికారులను అడ్డుపెట్టుకుని... వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. తాడేపల్లి నివాసం నుంచి.. సీఎం చోద్యం చూస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదని నేతలు తేల్చి చెప్పారు.