TDP Protest Against G O No.1: వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవో ఒకటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు ఉద్యమ బాట పట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో గౌతు శిరీష ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జీవో ప్రతులు దహనం చేశారు. విజయనగరం, చీపురుపల్లి, నెల్లిమర్లలో టీడీపీ నేతలు జీవో ప్రతులు దహనం చేసి ఆందోళన చేశారు. మన్యం జిల్లా సాలూరులో సంధ్యారాణి ఆధ్వర్యంలోని టీడీపీ కార్యకర్తలు మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురంలో ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ ఎల్ఐసీ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి తదితరులు జీవో ప్రతులను తగులబెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జీవో నెంబర్ ఒకటికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమ గృహనిర్బంధం నుంచి బయటకు రాగానే పోలీసులు అరెస్టు చేశారు. భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అడ్డుకునేందుకు యత్నించిన కార్యకర్తలపై లాఠీఛార్జి చేయడంతో గాయపడ్డారు. గన్నవరం వద్ద చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ అర్జునుడిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నేతలు నిరసన తెలిపారు. ప్రతిపక్షాలు సభ ఎక్కడ పెట్టుకోవాలో, ఏం మాట్లాడాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందా అని టీడీపీ నేత బొండా ఉమా ధ్వజమెత్తారు.
గుంటూరు జిల్లా ఆందోళనల నేపథ్యంలో తెలుగుదేశం కేంద్ర కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. కార్యాలయంలోకి ఎవ్వరూ వెళ్లకుండా కంచెలు వేసి రాకపోకలు నిలిపివేశారు. కార్యాలయ సిబ్బందినీ అడ్డుకున్నారు. గుంటూరులో గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబును పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యకర్తలతో కలిసి ఆయన జీవో ప్రతులు తగలబెట్టారు. ధూళిపాళ్ల నరేంద్రను ఆయన స్వగ్రామం చింతలపూడిలో గృహనిర్భంధం చేశారు. పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు నోటీసులు ఇవ్వగా, జీవో నంబర్ 1 ప్రతులను యరపతినేని దహనం చేశారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, సత్యసాయి జిల్లా మడకశిర తదితర ప్రాంతాల్లో జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని నేతలు నిరసన తెలిపారు. కుప్పంలో చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తల కంటే పోలీసులే చురుగ్గా పనిచేస్తున్నారని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.
నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ నేతలు నిరసనకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో ప్రతులు తగలబెట్టగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. చీకటి జీవోను రద్దు చేయాలని తిరుపతిలో టీడీపీ నేతలు ఆందోళన చేశారు. టీడీపీకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకే బ్రిటిష్ కాలం నాటి జీవోను తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: