TDP CHALO KAVALI : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఎస్సీలపై వరుస దాడులను నిరసిస్తూ తెలుగుదేశం చేపట్టిన చలో కావలి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులను ఇప్పటికే గృహ నిర్బంధం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ను ఇళ్లలోనే నిర్బంధించారు.
ఇంటి బయట డోలా బాల వీరాంజనేయస్వామి బైఠాయింపు: అనంతపురం నుంచి కారులో వస్తున్న టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజును వింజమూరు సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కొండెపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిని గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆయన ఇంటి బయటే బైఠాయించి నిరసన తెలిపారు.
వైసీపీ వేధింపులతో పలువురు ఆత్మహత్య: ముసునూరు ప్రాంతానికి చెందిన కరుణాకర్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన చావుకు అధికార పార్టీ నేతలే కారణమని సూసైడ్ నోట్లో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు యువత అధ్యక్షుడు హర్ష .. వైసీపీ నేతల వేధింపులతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గతంలో పొదలకూరుకు చెందిన నారాయణ చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు. ఈ ఘటనలను నిరసిస్తూ.. తెలుగుదేశం చలో కావలి కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతున్న చలో కావలి కార్యక్రమాన్ని హాజరవుతున్న సీపీఎం, సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడును అరెస్ట్ చేసి జలదంకి స్టేషన్కి తరలించారు.
ఇవీ చదవండి: