Nara Lokesh Yuvagalam Padayatra: ఏపీలో యువతకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం యువగళం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం.. రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించిన పండితులు.. లోకేశ్‌కు శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. లోకేశ్ రాకతో తిరుమలకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా వచ్చారు.
బుధవారం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్న లోకేశ్.. టీడీపీ నేతలతో కలిసి బైక్ ర్యాలీగా ఎన్టీఆర్ ఘాట్ చేరుకున్నారు. అక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించి.. అనంతరం కడప చేరుకున్నారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల అనంతరం.. అమీన్ పీర్ దర్గాని సందర్శించి.. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కడపలో పర్యటన తర్వాత నేరుగా తిరుమల చేరుకున్న లోకేశ్.. బుధవారం రాత్రి అతిథి గృహంలో బస చేసి.. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం లోకేశ్ నేరుగా కుప్పం బయలుదేరారు. శుక్రవారం ఉదయం అక్కడి శ్రీవరద రాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యువగళం పాదయాత్రను ప్రారంభిస్తారు. మరోవైపు పాదయాత్రకు టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇవీ చదవండి