రాష్ట్రంలో ట్యాక్సీలు దాదాపు 1.25 లక్షలున్నాయి. ఇందులో డ్రైవర్‌తో కలిపి ఎనిమిది సీట్లు ఉండే ఒక్కో రవాణా వాహనానికి త్రైమాసిక పన్ను రూ.4600 చొప్పున ఏడాదికి రూ.18,400 చెల్లించాల్సిందే. దీనికి తోడు ఏటా బీమా కింద అధికంగా చెల్లించాల్సి వస్తోంది. చాలా మంది బ్యాంకు రుణంతో సొంతంగా వాహనాన్ని కొనుగోలు చేసి తామే డ్రైవర్లుగా నడుపుతున్నారు. కరోనాకు ముందు వరకు వీరి పరిస్థితి బాగానే ఉంది.
కొవిడ్ మొదటి, రెండో దశలతో నెలలపాటు వాహనం బయటకు తీయలేని పరిస్థితి. అయినా త్రైమాసిక పన్నును చెల్లించాల్సిందేనని లేకుంటే వాహనాలను సీజ్ చేస్తామని రవాణా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర మోటారు వాహన చట్టప్రకారం వాణిజ్య వాహనం నుంచి వ్యక్తిగత వాహనంగా మార్చుకోవడానికి అనుమతి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించకపోవడంతో వేలాది మంది యజమానులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
మానవత్వం చూపండి
కరోనా వల్ల రవాణా రంగం తీవ్రంగా దెబ్బతింది. ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లకు పని లేకుండాపోయింది. దీంతో బ్యాంకు రుణాలు చెల్లించలేక చాలామంది ఇబ్బందిపడుతున్నారు. దీనికి తోడు రుణాలిచ్చిన సంస్థల ఆగడాల వల్ల పలువురు డ్రైవర్లు చనిపోయారు. ఈ నేపథ్యంలో తమ వాహనాల నంబరు ప్లేట్లను మార్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని రెండేళ్లుగా అడుగుతున్నా రవాణాశాఖ పట్టించుకోవడం లేదు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించి మానవతా దృక్పథంతో నంబరు ప్లేట్ మార్చుకోవడానికి అనుమతి ఇవ్వాలి.
-షేక్ సలావుద్దీన్, రాష్ట్ర ట్యాక్సీ డ్రైవర్ల, అసోసియేషన్ జేఏసీ ఛైర్మన్
హైదరాబాద్‌కు చెందిన జె.గిరిబాబు కొన్నాళ్ల కిందట బ్యాంకు రుణంతో రెండు ఇన్నోవాలు కొనుగోలు చేసి వాటిని ఒక రవాణా సంస్థకు అద్దెకు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఈ సంస్థ కూడా మూతపడింది. దీంతో ఈ వాహనాలకు పని లేకుండాపోయింది. అయినా ఆయన త్రైమాసిక పన్ను చెల్లిస్తూనే ఉన్నారు.
ఇదీ చూడండి: TS government: జిల్లాల్లో కొలువుల భర్తీ... కలెక్టర్లను ఆదేశించిన ప్రభుత్వం!