Tammineni Comments on Congress Alliance : అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన వైఖరితో ఒంటరిగా పోటీ చేస్తున్నామని.. సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఎం ఇతరులతో పొత్తుల కోసం వెంపర్లాడలేదని.. రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలరీత్యా గతంలో ఇతరులతో కలిసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న తమ్మినేని వీరభద్రం.. ఎన్నికలపై వివరించారు. కేంద్రంలో బీజేపీని ఓడించడమే తమ ఏకైక లక్ష్యమన్నారు.
కాంగ్రెస్‌తో పొత్తుకు ఫుల్స్టాప్ - స్వతంత్రంగానే 19 స్థానాల్లో పోటీ : తమ్మినేని
Telangana Assembly Elections 2023 : కాంగ్రెస్(Congress Party) పార్టీ అస్పష్ట వైఖరి వల్లే పొత్తులు విఫలమయ్యాయన్నారు. పొత్తులో భాగంగా ముందు ఎన్ని స్థానాలు కావాలో కాంగ్రెస్ నేతలు అడిగారని.. మొదట్లో తాము అడిగిన స్థానాలు ఇస్తామని చివరకు ఒక్క స్థానం కూడా ఇవ్వమన్నారని తమ్మినేని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు, ఎమ్మెల్సీలు ఇస్తామని కోమటిరెడ్టి వెంకట్ రెడ్డి లాంటి వారు చేసిన కామెంట్లపై అగ్రహించిన తమ్మినేని.. తమకు పదవులు ప్రాధాన్యం కాదన్నారు. ప్రధానమంత్రి పదవినే తృణప్రయంగా వదులుకున్నామని తమ్మినేని స్పష్టం చేశారు.
CPM Election Candidates : మునుగోడు ఎన్నికల వేళ వామపక్షాలు గేమ్‌ఛేంజర్‌గా మారారన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే.. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యేదన్నారు. ఇండియా కూటమిలో వామపక్షాలు భాగస్వామ్యంగా ఉండటం కేసీఆర్‌కు(CM KCR) నచ్చలేదని.. అందుకే కమ్యూనిస్టుతో పొత్తుల అంశాన్ని వదులుకున్నారని వివరించారు. నేడు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనపై ప్రజా వ్యతిరేక గాలి వీస్తోందని స్పష్టం చేశారు. బీజేపీ బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అనే స్థాయి నుంచి.. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనే స్థాయి వచ్చిందన్న తమ్మినేని.. అందుకు కారణం వామపక్షాల ముందస్తు ఆలోచనల ఎత్తుగడలేనని చెప్పారు.
అఖిల భారత స్థాయిలో బీజేపీ పాలన ప్రమాద స్థాయిలో ఉందని పేర్కొన్నారు. మోదీ మత ఉన్మాద పాలనకు వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయాలనేదే తమ లక్ష్యమన్నారు. ఇప్పుడు ఖమ్మంలో కాంగ్రెస్‌లో చేరినవారంతా బీజేపీలో చేరాలనుకున్నావాళ్లేనని తెలిపారు. పెద్ద రాక్షసి బీజేపీని ఎదుర్కొవాలంటే.. చిన్నదెయ్యమైన కాంగ్రెస్‌ను సమర్థించడం తప్పుకాదని అందుకే కాంగ్రెస్‌తో పొత్తులకు ఒకే అన్నామని వెల్లడించారు. మూడు విధానాలతో ప్రజల ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు తమ నిర్ణయాన్ని బలపరుచాలని కోరారు.
"అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన వైఖరితో ఒంటరిగా పోటీ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అస్పష్ట వైఖరి వల్లే పొత్తులు విఫలమయ్యాయి. సీపీఎం ఇతరులతో పొత్తుల కోసం వెంపర్లాడలేదు. మునుగోడు ఎన్నికల వేళ వామపక్షాలు గేమ్‌ఛేంజర్‌గా మారాయి. ఇండియా కూటమిలో వామపక్షాలు భాగస్వామ్యంగా ఉండటం కేసీఆర్‌కు నచ్చలేదు అందుకే.. కమ్యూనిస్టుతో పొత్తుల అంశాన్ని వదులుకున్నారు". - తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి