లాక్డౌన్ నేపథ్యంలో వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను ఎదుర్కొనేందుకు విద్యార్థులకు టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను అందించనున్నట్లు ఆసంస్థ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి తెలిపారు. జూన్ ఎనిమిదవ తేదీ నుంచి జరగబోయే పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపేందుకే ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలని పేర్కొన్నారు.
అనుభవం కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో అవగాహన కార్యక్రమాలను అందిస్తున్నట్లు చెప్పారు. జూన్ రెండవ తేదీ మంగళవారం మ్యాథమేటిక్స్ మొదటి పేపర్‌తో ప్రారంభమై ఐదవ తేదీన ఆంగ్లంతో ముగుస్తాయన్నారు. ఒక్కో పేపర్‌కు గంట సమయం కేటాయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జూన్ రెండో తేదీన గణితం మొదటి పేపర్ ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు అదే సమయాల్లో జూన్ మూడో తేదీన సైన్స్, నాల్గో తేదీన సోషల్, ఐదో తేదీన ఇంగ్లీష్ పేపర్లపై అవగాహన ప్రసారాలుంటాయని శైలేష్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ ప్రసారాలను విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులూ అనుసరించి పిల్లల్లో అవగాహన కల్పించాలని సీఈవో సూచించారు. విద్యార్థులు వారి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు టోల్ ఫ్రీ నం.1800 425 4038, ఫోన్ నం.040 23553473 సంప్రదించాలని కోరారు.