గ్రేటర్ హైదరాబాద్లో చెత్తసేకరణను ప్రైవేటు సంస్థ రాంకీకి అప్పచెప్పడాన్ని రద్దు చేసుకోవాలని సీఐటీయూ నగర అధ్యక్షుడు కె. ఈశ్వరరావు డిమాండ్ చేశారు. నగరంలోని ఇన్ సర్కిళ్లలో, మెయిన్ రోడ్లు, షాపుల్లోని వ్యర్ధాల సేకరణను అక్టోబర్ 1 నుంచి ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పే టెండర్లను ఉపసంహరించుకోవాలంటూ స్వచ్ఛ ఆటో, టిప్పర్, రిక్షా కార్మికులు హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు.
దీని వల్ల కార్మికుల జీవితాలు రోడ్డు మీద పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా ఇంటింటికి తిరుగుతూ, వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి వ్యర్ధాలను సేకరిస్తూ జీవనం సాగిస్తున్న తమపొట్ట కొట్టడం ప్రభుత్వానికి ఎంత వరకు సమంజసమని వాపోయారు. కరోనా సమయంలో సర్కారు తమకు ఎలాంటి సహకారం అందించకపోయినప్పటికీ ఉపాధి కోసం అనేక అవస్థలు పడుతూ చెత్త తొలగించామని కార్మికులు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకూ దశలవారీగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇదీ చూడండి: ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించిన ట్రావెల్స్ నిర్వాహకులు