నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి స్వామినాథన్ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇప్పటికే దేశంలో వ్యవసాయం తగ్గిపోయిందని, కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలతో.. సాగు అథోగతి పడుతుందని నారాయణ మూర్తి అన్నారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న మార్కెట్ యార్డులు సహా అన్నింటినీ తొలగించడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దేశం, ఒకే చట్టంతో దళారీ వ్యవస్థ మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు హాని కలిగించేలా ఉన్న ఈ చట్టాలని వ్యతిరేకించాల్సింది పోయి కేంద్రానికి తొత్తులుగా రాష్ట్రాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
ధరలు పెంచే ప్రమాదం..
కేంద్ర విధానాల వల్ల ఆహార భద్రతను కోల్పోయే ప్రమాదం ఉందని, కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే ప్రమాదం సైతం ఉందని అంచనా వేశారు. వ్యవసాయ రంగాన్ని కేంద్రం గుప్పిట్లో ఉంచుకుంటే రైతు జీవితాలకు భద్రత ఉండదన్నారు. భావితరాల కోసం ప్రస్తుత పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి పంటకు కనీస మద్దతు ధర కల్పించే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని నారాయణ మూర్తి డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు కలిసి మెలిసి ఉద్యమాన్ని ముందుకు నడపాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఎన్నికల విధుల్లో పాల్గొంటాం: ఉద్యోగ సంఘాలు