‘‘హైదరాబాద్ ఔషధ నగరిలో స్థానికులకు ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తాం. ప్రాజెక్టు కోసం భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. - పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.
హైదరాబాద్ నగర శివారు రంగారెడ్డి జిల్లాలో యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో ఔషధ నగరి ఏర్పాటుకు భూ సేకరణ వేగంగా జరుగుతోంది. ఔషధ పరిశ్రమలన్నీ ఒకేచోట ఏర్పాటు చేయాలన్నది ప్రాజెక్టు ఉద్దేశం. దశలవారీగా 18 వేల ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, యాచారం, కందుకూరు మండలాల్లో కలిపి సుమారు 7,400 ఎకరాలు సేకరించారు.
- యాచారం మండలం మేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద పరిధిలో పది వేల ఎకరాలు సేకరించాల్సి ఉండగా ప్రభుత్వ, పట్టా భూములు కలిపి ఏడు వేల ఎకరాలు సేకరించారు. మరో రెండు వేల ఎకరాలకు సంబంధించి సర్వే, అవార్డు జారీ వంటి దశలు కొనసాగుతున్నాయి. మరో వెయ్యి ఎకరాల సేకరణ చేపట్టాల్సి ఉంది.
- కందుకూరు మండలంలో మీర్‌ఖాన్‌పేట, ముచ్చర్ల, పంజగూడ గ్రామాల్లో 2,769 ఎకరాలు సేకరించగా, మరో 1421 ఎకరాలు వివిధ దశల్లో ఉంది. ● కడ్తాల్ మండలంలోని ముద్విన్ గ్రామంలో 267 ఎకరాలు తీసుకోగా, కడ్తాల్‌లో 926 ఎకరాలు గుర్తించారు.
వ్యతిరేకత రాదన్న ఆశాభావం.. ఆయా గ్రామాల్లో భూములు కోల్పోతున్న నిర్వాసిత కుటుంబాల స్థితిగతులు, కుటుంబ సభ్యుల విద్యార్హతలు, సాంకేతిక కోర్సులు చదివారా.. వంటి అంశాలపై రెవెన్యూ సిబ్బంది సమాచారం సేకరిస్తారు. యాచారం మండలంలో ఇటీవల స్వయం సహాయక సంఘాల సభ్యులతో సర్వే నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించారు. క్షేత్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో ముందుకు సాగలేదు. తాజాగా ఉద్యోగావకాశాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో సాఫీగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.
కుటుంబాల పరిశీలన.. ఫార్మా సిటీకి రైతులు మూడు విధాలుగా భూములు కోల్పోతున్నారు. కొందరు పట్టా భూములు కోల్పోతుండగా.. మరికొందరు అసైన్డ్ భూములు కోల్పోనున్నారు. వీరితోపాటు కొన్ని దశాబ్దాలుగా పొజిషన్‌లో ఉన్న రైతుల నుంచీ భూములు తీసుకుంటున్నారు. ‘‘ప్రస్తుత సర్వేలో భూములు కోల్పోతున్న అన్ని కుటుంబాల వివరాలు సేకరిస్తాం. ప్రభుత్వం సూచనల మేరకు ఆయా అంశాల ఆధారంగా సర్వే చేస్తాం. రేపట్నుంచి గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది పరిశీలన ప్రారంభిస్తారు. సాధ్యమైనంత త్వరగా వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తాం.’’ అని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది!