Pending Bills Issue: శాసనసభ పంపించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఈ కేసుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.శ్రీనరసింహ, జస్టిస్ జె.బి.పర్డీవాలాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడానికి ధర్మాసనం ఉపక్రమించగా.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ అవసరం లేదని.. తాను విషయాన్ని తెలుసుకొని ప్రభుత్వానికి చెబుతానని సీజేఐకి విన్నవించారు. తాను ఇక్కడే ఉన్నందున ప్రత్యేకంగా కేంద్రానికి నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే మంగళవారం వెలువడిన ధర్మాసనం లిఖితపూర్వక ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది.
Pending Bills at Governor: గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ప్రభుత్వం శాసనసభలో ఆమోదం తెలిపిన బిల్లులు గవర్నర్ వద్దకు పంపిస్తే.. పెండింగ్‌లో ఉంచుతున్నారని అధికార పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం 8 బిల్లులను తీసుకొచ్చింది. అందులో రెండు కొత్త బిల్లులు కాగా.. మిగతా ఆరు చట్ట సవరణలకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసేలా చట్టం తీసుకొచ్చేందుకు సర్కార్ బిల్లును తీసుకొచ్చింది. సిద్దిపేట, ములుగు జిల్లాలో ఉన్న అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మారుస్తూ చట్టం రూపకల్పన చేసేందుకు మరో బిల్లు తీసుకొచ్చింది. మరికొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి లభించేలా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరణకు తీసుకొచ్చిన బిల్లులు ఉన్నాయి.
జీహెచ్ఎంసీ, పురపాలకచట్టాలకు సవరణ చేస్తూ మరో బిల్లు తీసుకురాగా.. వీటితో పాటు పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్టం, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్టం, జీఎస్టీ చట్టాలను సవరిస్తూ బిల్లులను తీసుకొచ్చింది. ఈ బిల్లులు గత ఏడాది సెప్టెంబర్ 13న మొత్తం 8 బిల్లులు ఉభయసభల ఆమోదం లభించింది. అనంతరం గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపారు. అయితే అందులో ఒక్క జీఎస్టీ చట్టసవరణ బిల్లు మాత్రమే ఆమోదం పొంది చట్టంగా రూపు దాల్చగా.. మిగిలిన ఏడు బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించలేదు. వీటితో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించుకున్న మరో 3 కొత్త బిల్లులను సైతం గవర్నర్ పెండింగ్‌లో పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.
ఇవీ చదవండి:
TSPSC పేపర్ లీకేజీ కేసు.. కమిషన్ పరిస్థితులు చూసి సిట్ అధికారులు షాక్..
నన్ను ఆ విషయంలో హేళన చేశారు: గవర్నర్ తమిళి సై
ఆలస్యంగా మేల్కొని.. గడువు ముగిశాక ఇవ్వమని అడుగుతారు: తమిళి సై