Disha Encounter Case: దిశ హత్యాచారం అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్ కేసులో విచారణ ఇకపై తెలంగాణ హైకోర్టులోనే జరుగుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఇక్కడ విచారణ చేపట్టబోమని.. మిగతా అంశాలు హైకోర్టు చూసుకుంటుందని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ వి.ఎస్.సిర్పుర్కర్ కమిషన్ సమర్పించిన తుది నివేదికపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. హైదరాబాద్ శివార్లలో దిశ హత్యాచారం ఘటన అనంతరం నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై న్యాయవాదులు జి.ఎస్.మణి తదితరులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు దీనిపై విచారణకు జస్టిస్ సిర్పుర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్‌ను నియమించిన విషయమూ విదితమే. శుక్రవారం విచారణ సందర్భంగా కమిషన్ నివేదికను సీల్డు కవరులో ఉంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీన్ని తిరస్కరించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ.. ‘కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నేరానికి పాల్పడిన వారిపై హైకోర్టు విచారణ చేపడుతుంది’ అన్నారు. దయచేసి నివేదికను తిరిగి సీల్ చేయాలని శ్యామ్ దివాన్ అభ్యర్థించారు. ‘బహిరంగంగా విచారణ చేపట్టిన తర్వాత గోప్యత ఏముంది? మీరు కోరితే నేను బయటకు చదివి వినిపిస్తా. రోజువారీగా ఈ కేసును మేం విచారించలేం. తర్వాత ఏం చర్యలు తీసుకోవాలనేదే ఇక్కడ ప్రశ్న. ఈ అంశంపై హైకోర్టు విచారణ చేపడుతుంది. పిటిషన్‌దారులకు, ప్రతివాదులకు నివేదిక ప్రతులు అందజేస్తాం’ అని సీజేఐ తెలిపారు. ఈ అంశం ట్రయల్ కోర్టుకు వెళ్లేముందు విచారణలపై ఏ ప్రభావమూ పడకూడదని భావిస్తున్నామని శ్యామ్ దివాన్ విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు కమిటీని నియమించిన తర్వాత నివేదిక ఏ విధంగానైనా రావచ్చని... దానికి కోర్టు ఏం చేస్తుందని సీజేఐ ప్రశ్నించారు. సీల్డు కవరులో నివేదికలు ఉంచాలని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని శ్యామ్ దివాన్ గుర్తుచేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలకు అది వర్తిస్తుందని.. ఇది ఎన్‌కౌంటర్ కేసని సీజేఐ బదులిచ్చారు. నివేదికను బహిర్గతం చేస్తే అది న్యాయపాలనపై ప్రభావం చూపుతుందని శ్యామ్ దివాన్ అన్నారు.
న్యాయస్థానం ఆ నివేదికను ఎందుకు పబ్లిక్‌డొమైన్‌లో పెట్టకూడదని జస్టిస్ హిమా కోహ్లి ప్రశ్నించారు. బహిరంగ విచారణ తర్వాత అందులో గోప్యత ఏముందని ప్రశ్నించిన సీజేఐ.. దేశంలో ఎటువంటి దారుణమైన పరిణామాలు నెలకొన్నాయో తాము చూస్తున్నామన్నారు. నివేదిక ఆధారంగా జాతీయ అంశాలను ధర్మాసనం స్పృశించినందున నివేదికను తిరిగి సీల్ చేసి హైకోర్టుకు పంపాలని.. లేని పక్షంలో వేసవి సెలవులయ్యే వరకు పక్కన పెట్టి.. తర్వాత దాన్ని గోప్యంగా ఉంచాలో, బహిర్గతం చేయాలో నిర్ణయించాలని శ్యామ్ దివాన్ కోరారు. ఈ దశలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ జోక్యం చేసుకున్నారు. మణిపుర్‌లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం కింద సైన్యం చేసిన హత్యలకు సంబంధించిన నివేదికలను బహిర్గతం చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించిందన్నారు. కమిషన్ బహిరంగ విచారణ చేపట్టి.. ఆ వివరాలు నమోదు చేసిందనే విషయం గుర్తించాలని కోరారు. మీరు వాయిదా కోరుకుంటే అది వేరే అంశమని, మీ క్లయింట్‌ను (రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు) అడిగి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని శ్యామ్ దివాన్‌కు సీజేఐ సూచించారు. పది నిమిషాల పాటు విచారణను వాయిదా వేశారు. తర్వాత కేసు విచారణ పునఃప్రారంభమైంది. విచారణను వేసవి సెలవుల తర్వాత చేపట్టాలని.. లేకుంటే నివేదికను బహిర్గతం చేయొద్దని మరోసారి శ్యామ్ దివాన్ అభ్యర్థించారు. దీన్ని తిరస్కరించిన ధర్మాసనం.. కేసు విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది.
- విచారణ మధ్యలో పది నిమిషాల వాయిదా అనంతరం పిటిషన్ వేసిన న్యాయవాది జి.ఎస్.మణి కల్పించుకొని తాను ఇక్కడే ఉన్నానని తెలిపారు. అప్పటికీ శ్యామ్ దివాన్ కోర్టు హాల్లోకి రాలేదు. ‘మీరు అంత కంగారు పడాల్సిన పని లేదు. ప్రచారం కోసం మీరు అనేక రిట్ పిటిషన్లు వేస్తారనే విషయం తెలుసు’ అంటూ మణిని సీజేఐ మందలించారు.
- ఈ కేసు విచారణ సందర్భంగా.. ఎన్‌కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన సజ్జనార్, కేసుతో సంబంధం ఉన్న ఇతర పోలీసు అధికారులు సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.
ఇవీ చదవండి: