MLA purchase case case updates: 'ఎమ్మెల్యేల ఎర' కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్.. సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు వచ్చింది. గతరాత్రి 9గంటలకు పిటిషన్.. విచారణ జాబితాలోకి వచ్చిందని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు.
తాము కూడా కేసు వివరాలు చదవలేదని పిటిషన్‌ను విచారిస్తున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్‌మిశ్రా అన్నారు. ఈ దశలో కేసు తీవ్రమైనదని, నిందితులపై నమోదైన కేసులు తీవ్రమైనవని దవే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రజాస్వామ్యానికి.. తీవ్ర నష్టం కలిగిస్తుందని, అందుకే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం వేసిందని.. మొత్తం కేసు పర్యవేక్షణను సిట్ చేతికి ఇచ్చిందని దవే గుర్తుచేశారు.
ఈ దశలో కేసు వివరాలను ముఖ్యమంత్రే స్వయంగా పెన్‌డ్రైవ్‌లలో మీడియా సహా అందరికి పంపారని బీజేపీ తరపు న్యాయవాది జఠ్మలానీ కోర్టుకు తెలిపారు. తమకు కూడా వివరాలు అందాయని జస్టిస్ గవాయ్ చెప్పగా.. ఈ కేసుకు సంబంధించిన తమ వద్ద ఐదు గంటల వీడియో, కాల్ డేటా, వాట్సప్ మెసేజ్‌లు.. ఇంకా చాలా అధారాలు ఉన్నాయని దవే వివరించారు. సీబీఐ, ఈడీ కూడా లీకులు ఇస్తున్నాయని తెలిపారు.
ఈ కేసులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని.. దవే కోర్టుకు వివరించారు. అలాంటపుడు కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేసే సీబీఐకి కేసు దర్యాప్తును.. ఎలా అప్పగిస్తారని దవే ప్రశ్నించారు. ఇప్పటికే సిట్ దర్యాప్తు చేస్తుండగా.. సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి తమకు ఎక్కువ సమయం కావాలని అందుకు వాయిదా వేయాలని దవే కోరారు.
కేసు ప్రాథమిక దశలోనే పూర్తిగా విచారించాల్సి ఉందని.. దవే ధర్మాసనానికి వివరించారు. ఈ వాదనలు విన్న కోర్టు ఈనెల 27న కేసు విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఆరోజు జాబితాలోని అన్ని కేసులు ముగిసిన తర్వాత 'ఎమ్మెల్యేలకు ఎర కేసు' చేపట్టనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
ఇవీ చదవండి:
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి అప్పగింతపై సుప్రీంలో సవాల్
సీబీఐ విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారు: బండి సంజయ్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ఆడియో వైరల్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు సుప్రీం గ్రీన్ సిగ్నల్