తెలంగాణ ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి నూతన భవనాలు నిర్మించాలని మంత్రి వర్గ ఉపసంఘం ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదించింది. ప్రగతిభవన్లో గురువారం సమీక్షించిన సీఎంకు ఉపసంఘ సభ్యులు, ఉన్నతాధికారులు ఈ మేరకు నివేదించారు. ప్రస్తుత భవనాలు అధ్వానంగా ఉన్నాయని... మార్పులు, మరమ్మతులు వృథా అని ఉపసంఘం సూచించింది.
అంశాల పరిశీలన
సచివాలయ నిర్మాణంపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం వివిధ శాఖల అధికారులతో సమీక్షించింది. విద్యుత్, రోడ్లు, భవనాల శాఖ సూచించిన ఆధారంగా నివేదికను రూపొందించి ముఖ్యమంత్రికి అందించింది. ఈ నివేదికలో అంశాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. దీనిపై త్వరలో మంత్రి మండలిలో చర్చించి ఆమోదం పొందాలని నిర్ణయించారు. నివేదికను న్యాయస్థానానికి కూడా అందజేయనున్నట్లు తెలిసింది.
మరమ్మతులకు ఏటా రూ.5 కోట్లు
ప్రస్తుతమున్న భవనాలను కొనసాగిస్తే మరమ్మతులకు ఏటా రూ.5 కోట్లు వెచ్చించాలని అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుత భవన సముదాయాల్లోని బ్లాకుల్లో ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఆర్పడానికి శకటాలు వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. సీఎం, మంత్రులు వేర్వేరు పేషీల్లో ఉండడం వల్ల ముఖ్యమైన ఫైళ్లను వేర్వేరు బ్లాకులకు తిప్పాల్సి వస్తుందని... దీని వల్ల అధికార రహస్యాలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. డీ, హెచ్ బ్లాకులు తప్ప మిగతావన్నీ 50 ఏళ్ల కాల పరిమితి ముగిసినవేనని తమ నివేదికలో వెల్లడించారు. పేషీల్లో ప్రముఖులకు భద్రత సరిగా లేదని కూడా అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి : పల్లె అభివృద్ధికి "30రోజుల కార్యచరణ" శ్రీకారం..!