తెలిసీతెలియని వయసులో చిన్నారులు పక్కదారి పడుతున్నారు. ఆరోగ్యాన్ని తినేసే మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ పరిధిలో విద్యార్థులు కొత్తరకం మత్తులో విహరిస్తున్నారు. ఫెవికాల్, బోనో ఫిక్స్లను కొనుగోలు చేసి వీటిలోని ద్రావణాన్ని కవర్లలో నింపుతున్నారు. అనంతరం రసాయన వాసనలను చవిచూస్తూ మత్తులోకి జారుకుంటున్నారు. నాలుగో తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు సైతం వీటికి అలవాటు పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిని వ్యసనంగా మార్చుకున్న కొందరు చిన్నారులు చదువులు మాని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటూ భవిష్యత్తును అగమ్యగోచరం చేసుకుంటున్నారు.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
ఫెవికాల్, బోనోఫిక్స్, పెట్రోలియం ఉత్పత్తులలోని రసాయనాల వాసనలతో మత్తుకు గురవుతున్న చిన్నారుల ఆరోగ్యం దయనీయంగా తయారవుతుందని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర సింగ్ తెలిపారు. ఊపిరితిత్తులు, నరాలకు సంబంధించిన వ్యాధులు విజృంభిస్తాయని వెల్లడించారు. చిన్నారుల అలవాట్లను ముందుగానే గుర్తించి వాటిని మాన్పించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని డాక్టర్ సూచించారు.
పర్యవేక్షణ అవసరం
6 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని ప్రముఖ సామాజిక వేత్త పోలుకొండ పురుషోత్తమ దేవ్ సూచిస్తున్నారు. పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని అన్నారు. అతిగారాబం, నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు సంఘ విద్రోహులుగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.