జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్నవారినే లెక్కింపు కేంద్రంలోకి పంపేవిధంగా క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు చేశారు. 150 డివిజన్ల కోసం ఏర్పాటు చేసిన 30 లెక్కింపు కేంద్రాల్లో డివిజన్‌కు ఒక హాల్‌ను కేటాయించి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. హాళ్లలో అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ఓట్లు లెక్కించే అధికారులుంటారు.
మూడంచెల భద్రత...
లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14, సైబరాబాద్ పరిధిలో 10, రాచకొండ పరిధిలో 6 లెక్కింపు కేంద్రాలున్నాయి. ఎక్కువ సమస్యాత్మక ప్రాంతాలున్న చార్మినార్ జోన్‌లో 36 డివిజన్లున్నాయి. 36 డివిజన్లకు సంబంధించిన లెక్కింపును 6 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించనున్నారు.
డివిజన్ల వారీగా...
సిటీ కళాశాలలో చార్మినార్ సర్కిల్‌కు చెందిన 5 డివిజన్లు, బండ్లగూడలోని మహావీర్ ఇనిస్టిట్యూట్‌లో సంతోశ్‌నగర్ సర్కిల్‌కు చెందిన 6 డివిజన్లు, అరోరా అకాడమీలో చంద్రాయణగుట్టకు చెందిన 7 డివిజన్లు, కమలా నెహ్రూ కళాశాలలో ఫలక్‌నుమా సర్కిల్ కు చెందిన 6 డివిజన్లు, వెటర్నరీ కళాశాలలో రాజేంద్రనగర్ సర్కిల్‌కు చెందిన 5 డివిజన్లు, అంబర్ పేట్ ఇండోర్ స్టేడియంలో మలక్‌పేట్‌కు చెందిన 7 డివిజన్ల లెక్కింపును నిర్వహించనున్నారు.
అదనపు బందోబస్తు...
ఈ లెక్కింపు కేంద్రాల వద్ద కొన్ని సమస్యాత్మక ప్రాంతాలున్న డివిజన్లు ఉన్న దృష్ట్యా పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాల సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిటీ కళాశాల మార్గం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు అధిక సంఖ్యలో వెళ్తుంటాయి. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ర్యాలీలు నిషేధం...
లెక్కింపు కేంద్రాల వద్దకు వచ్చే అభ్యర్థులు, ఏజెంట్ల వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. నిర్ధరించిన స్థలంలోనే వాహనాలు నిలపాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై, బాణాసంచా, బ్యాండ్మేలాలను పోలీస్ ఉన్నతాధికారులు నిషేధం విధించారు. గెలుపొందిన అభ్యర్థులు, పార్టీలు 48 గంటల తర్వాతే ర్యాలీలు నిర్వహించుకోవాలని నిబంధన విధించారు.
ఇదీ చూడండి: ఏర్పాట్లు పూర్తి.. మొదటి ఫలితం వెలువడేది అక్కడే!