కూరగాయలు, పండ్లు, పళ్లు, అల్పాహారం, తినుబండారాలు, చెరకు రసం, గృహోపకరణాలు, ఆభరణాలు, ఇతర సామగ్రి విక్రయం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు చిన్న వ్యాపారులు. ఫుట్‌పాత్‌లు, రద్దీ ఉన్న మార్కెట్లలో చౌకధరలకు వస్త్రాలు, దుస్తుల అమ్మేవారూ అధికమే. కొందరు టైర్ల పంక్చర్, చిన్నచిన్న మెకానిక్ షాపులు నడుపుతున్నారు. లాక్‌డౌన్ కారణంతో వారి జీవనం అధ్వానంగా తయారైంది. రోజు సంపాదన మీదే బతికే ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కూరగాయలు, పండ్ల, పూలు, తినుబండారాల వ్యాపారులు తాము తెచ్చింది, తయారు చేసింది విక్రయించలేని పక్షంలో వాటిని చెత్తకుప్పల్లో పడేయాల్సిందే. ‘అయిదేళ్లుగా గచ్చిబౌలిలో చెరకు బండి నడుపుతున్నాను. రోజంతా రూ. 2 వేల అమ్మకాలు జరిగేవి. ఖర్చులు పోనూ రూ. 500 మిగిలేవి. వాటితోనే కుటుంబం గడిచేది. గత పది రోజులుగా ఒక్కోనాడు రూ. 100 రావడం గగనంగా మారింది. రూ. రెండువేలతో చెరకు గడలు కొనుగోలు చేసి తెస్తుంటే సగం ఎండిపోతున్నాయి. లాభం రాకపోగా తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు శివలీల. ఈమె మహబూబ్‌నగర్ నుంచి వచ్చి నగరంలో చెరకు రసం బండి పెట్టుకున్నారు.
రమేశ్... వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన నిరుపేద. భార్యాపిల్లలతో వచ్చి హైదరాబాద్ బోరబండలో ఉంటున్నాడు. స్థానికంగా ఒక వీధిలో కాలిబాటపై కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు విక్రయాలు జరిపేవాడు. రోజుకు రూ. వేయి ఆదాయం వచ్చేది. వచ్చిన ఆదాయంలో రెండు చిట్టీలు వేసేవాడు. లాక్‌డౌన్ వచ్చాక పరిస్థితి మారిపోయింది. రోజుకు రూ. మూడు వందలు కూడా అమ్మకాలు జరగడం లేదు. చిట్టీలు ఆగిపోయాయని వాపోతున్నాడు.
రాజేందర్...అల్పాహార విక్రయదారుడు, నల్గొండ నుంచి వచ్చి హైదరాబాద్ మాదాపూర్‌లో అల్పాహార బండి నడుపుతున్నారు. రోజుకు 200 మందికి పైగా వచ్చేవారు. రూ. 5 వేల ఆదాయం వచ్చేది. కరోనా వచ్చాక అంతా తలకిందులైంది. ఉదయం పూట బండి తీసి... ఎవరు వస్తారా అని ఎదురుచూడాల్సి వస్తోంది. పార్సిళ్లు పూర్తిగా ఆగిపోయాయి. రుబ్బిన పిండి, ఇతర పదార్థాలను తీసుకొని ఉదయం 9.30కి ఇంటిబాట పడుతున్నారు.
సాదిక్... హన్మకొండ చౌరస్తాలో... చిన్నచిన్న గృహోపకరణాల బండి నడుపుతున్నారు. ఉదయం 11 తర్వాతే అతని వ్యాపారం సాగుతుంది. రోజుకు రూ. 1500 ఆదాయం వస్తోంది. ఈ నెల 12 నుంచి అతను ఇంటి నుంచి బయటికి వెళ్లడం లేదు. పైసా రాబడి రాకపోగా సామానంతా ఇంట్లోనే ఉండిపోయిందని, నలుగురు పిల్లలతో కుటుంబం గడిచేది ఎలా అంటూ కన్నీళ్లపర్యంతమవుతున్నాడు.
నిజామాబాద్ నుంచి వచ్చి ఇక్కడ టీకొట్టు పెట్టుకుని బతుకుతున్న సాజిదాది కూడా ఇలాంటి పరిస్థితే. ‘లాక్‌డౌన్ ముందు వరకు చాయ్ అమ్మకాలు బాగా జరిగేవి. రోజుకు రూ. 1200 వచ్చేవి. పొద్దునే వాకింగ్ పోయేవారు, ఆటోవాళ్లు, పారిశుద్ధ్య సిబ్బంది టీ తాగేవారు. లాక్‌డౌన్ మొదలయ్యాక ఇటువైపు ఎవరూ చూడడం లేదు. రోజు గడవడం కూడా కష్టంగా ఉంది’ అని అంటున్నారామె. ఇలాంటి స్థితిలో ఉన్నవాళ్లు కోకొల్లలు. వీధి వ్యాపారులు స్థానికంగా ఉండే పెద్ద వ్యాపారుల వద్ద బకాయికి సరకు తీసుకుంటారు. వాస్తవానికి వీధివ్యాపారాలు ఉదయం ఎనిమిది, తొమ్మిది నుంచి ప్రారంభమవుతాయి. పది తర్వాతే అమ్మకాలు ఊపందుకుంటాయి. ఎండగా ఉన్న సమయంలోనే పళ్లు, చెరకు రసాల వ్యాపారాలు జరుగుతాయి. ప్రస్తుతం తొమ్మిది గంటలకే అంతా సర్దేస్తున్నారు. పోలీసులను చూసి ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. లాక్‌డౌన్ ఉపశమనం ఉన్న నాలుగు గంటల్లో సరకు అమ్ముడవక, అలాగని వ్యాపారం మానలేక వీరు పడే బాధ వర్ణనాతీతం. ఇళ్లు,షాపుల యజమానులు, పోలీసులు, బస్తీ నేతల నుంచి నిత్యం సమస్యలు ఎదురవుతున్నా... అన్నింటినీ తట్టుకుంటూ కొనసాగుతున్న వీరి జీవితాలపై కరోనా సమయం పిడుగుపాటే అని చెప్పాలి.
గంట కూడా నడవడం లేదు
ఉదయం ఆరు గంటలకు కూరగాయలు తెచ్చినా... జనం తొమ్మిది గంటలకు బయటికి వస్తున్నారు. అరగంట వ్యాపారం చేసి ఇంటికి పరుగెత్తాల్సి వస్తోంది. తెచ్చిన కూరగాయల్లో సగం మిగిలేపోతున్నాయి.
-రాజయ్య, కూరగాయల వ్యాపారి, కరీంనగర్
వంద రూపాయల అమ్మకం కూడా లేదు
మార్కెట్‌కు వెళ్లి రోజూ ఉదయం పండ్లు కొనుక్కొని వచ్చి బండి మీద వెళ్లి అమ్ముతున్నాను. ఉదయం ఆరు గంటలకు వెళితే ఎవరూ లేవడం లేదు. ఒక్కో రోజు వంద రూపాయల అమ్మకాలు కూడా జరగడం లేదు.తెచ్చిన వాటిని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నాను. రెండోరోజుకు పండ్లు పాడవుతాయి. ఎలా బతకాలి.
- చుక్కయ్య పండ్ల వ్యాపారి, ఆదిలాబాద్
బండ్లు రావడమే అరుదైంది
టైర్ల పంక్చర్, గాలి కొట్టడం ద్వారా జీవనోసాధి పొందుతున్నాను. రోజుకు 40, 50 వాహనాలు వచ్చేవి. వెయ్యి రూపాయల వరకు ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్‌తో ఇప్పుడు ఒక్క బండి కూడా కనిపించడం లేదు. ఉదయం మార్కెట్ల వద్దకే బండ్లు వెళ్తున్నాయి. రోడ్లపై కనిపించడం అరుదుగా మారింది. తొమ్మిది కాగానే ఇంటికి బయల్దేరుతున్నాను. ఏ మాత్రం రాబడి లేకుండా పూటగడవడం కష్టంగా మారింది.
-జాఫర్, మెకానిక్, ఖమ్మం
ఇదీ చూడండి: మీకు కొవిడ్ సోకిందా..? మీ పిల్లల్ని మేము చూసుకుంటాం