రాత్రిపూట రంగులీనుతున్న విద్యుత్ కాంతుల్లో.. ఆరుబయట రోడ్డు మీద కూర్చుని.. స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతూ.. రుచికరమైన ఆహారం తింటుంటే... ఆ మజానే వేరుకదా.. ఎంతటి ఒత్తిడైనా దరిచేరదు సరికదా ఆ అనుభూతే చెదరని జ్ఞాపకం. ఏ ఉద్యోగం లేకపోతే హైదరాబాదులో అల్పాహార బండి పెట్టుకుని హాయిగా బతికేయొచ్చంటారు. నగరంలో ఏ సమయంలోనైనా వేడి వేడిగా ఆహారం దొరుకుతుంది. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో చిరు వ్యాపారులు తెలుగు రుచులు పరిచయం చేస్తూ రాత్రిపూట పనిచేసే ఉద్యోగుల ఆకలి తీరుస్తున్నారు.
రుచితో పాటు శుచికరమైన ఆహారం
సాయంత్రం ఏడు నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఆహారం దొరుకుతుంది. కేవలం టీ, కాఫీలే కాకుండా ఇడ్లీ, దోశ, వడ ఇలా రకరకాల తెలుగు రుచులు ఐటీ ఉద్యోగుల మనసు దోచుకుంటున్నాయి. రాత్రి వేళ అల్పాహారం తినడం వల్ల మరింత ఉత్తేజంగా పనిజేయగలుగుతున్నామంటున్నారు ఉద్యోగులు. రుచితో పాటు శుచిగా ఉండడం వల్ల తీరిక దొరికితే బండి దగ్గర వాలిపోతున్నారు వారు.
వ్యాపారం సాఫీగా
రాత్రివేళ మంచి వ్యాపారం జరుగుతుందని శుచికరమైన ఆహారం వడ్డించడం వల్ల ఉద్యోగులు క్రమం తప్పకుండా వస్తున్నారని యజమానులు అంటున్నారు. దీనివల్ల నాలుగు డబ్బులు సంపాదించుకునే అవకాశం దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి సమయంలో రుచికరమైన ఆహారం దొరకడం వల్ల రాత్రి షిఫ్ట్‌లో పనిచేసే ఐటీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు వ్యాపారులకు గిట్టుబాటు అవుతోంది. ప్రశాతంగా నగరం నిద్రపోతున్న వేళ రంగురంగుల వెలుగుల్లో దొరికే వేడి వేడి వంటకాలను మీరూ ఓ సారి రుచిచూడండి.
ఇదీ చూడండి: ఈ 'జైలు బిర్యానీ'కి మహా క్రేజ్ గురూ!