Street Dogs In Telangana: రాష్ట్రంలో వీధి కుక్కలు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసన్(ఐపీఎం)కు రోజూ సుమారు 400 మంది కుక్కకాటు బాధితులు యాంటీ రేబిస్ సూది మందు కోసం వస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్యశాఖ గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో ఈ ఏడాదిలో జనవరి నుంచి నవంబరు వరకూ 1,68,367 మంది కుక్కకాటుకు గురవడం తీవ్రతకు అద్దం పడుతోంది.
ప్రైవేటుగా చికిత్స పొందిన వారి సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుందనేది అంచనా. రాష్ట్రం మొత్తమ్మీద అత్యధిక కుక్కకాటు కేసులు హైదరాబాద్(17,361)లోనే నమోదయ్యాయి. వైద్యఆరోగ్యశాఖ అంచనా ప్రకారం.. బాధితుల్లో పెంపుడు కుక్కల కారణంగా 29 శాతం మంది, వీధి కుక్కల దాడుల్లో 71 శాతం మంది గాయపడ్డారు.తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కుక్కలతోపాటు కోతుల బాధితుల సంఖ్యా పెరిగిపోతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ వీటి కారణంగా గాయపడి చికిత్స పొందినవారు సుమారు 2 లక్షలకు పైగా ఉన్నారు. పాము కాటు కేసులూ ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయి.
నియంత్రణ చర్యలేవి?: వీధికుక్కల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నా..నిరోధించడంలో పురపాలికలు, పంచాయతీలు విఫలమవుతున్నాయనే విమర్శలున్నాయి. వాటిని పట్టుకునే సుశిక్షితులైన సిబ్బంది కొరతా వేధిస్తోంది. ఒప్పంద పద్ధతిలో సిబ్బందిని నియమించుకుని, వారికి శిక్షణ ఇప్పించుకోవాలనే ప్రతిపాదన ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు. శునకాలను బంధించి తీసుకెళ్లే వాహనాలూ అరకొరగానే ఉన్నాయి.
ఇక సంతాన నియంత్రణ చర్యలు తూతూమంత్రంగా సాగుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే తాజా లెక్కల ప్రకారం సుమారు 6.5 లక్షల కుక్కలున్నట్లు అంచనా. వీటికి ఎప్పటికప్పుడు సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించకపోవడంతో వాటి సంతతి అంతకంతకూ పెరుగుతోంది. ‘తగినంత సిబ్బంది, పరికరాలు లేని కారణంగా 20 శాతం వాటికీ శస్త్ర చికిత్సలు చేయలేకున్నామ’ని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.
రేబిస్ ఉన్న కుక్కల లక్షణాలు
* సాధారణంగా అవి ఒంటరిగా ఉంటాయి.
* చొంగ కారుస్తుంటాయి.
* కళ్లు తేలేస్తుంటాయి.
* నీళ్లంటే భయపడుతుంటాయి.
* వాటికి ఎదురుగా ఏదీ కనబడదు.
అందుబాటులో ఉచిత మందులు: కుక్క, పాము కాటు మందులను ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహా అన్ని స్థాయుల ఆసుపత్రుల్లో ఉచితంగా అందజేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.4,14,79,142 విలువైన 1,20,405 డోసుల యాంటీ రేబిస్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.19,91,574 విలువైన 9,147 డోసుల పాముకాటు ఇంజక్షన్లు సిద్ధంగా ఉన్నాయి.
గాయానికి కట్టు కట్టొద్దు: రేబిస్ వైరస్ నాడీ మండలంపై దుష్ప్రభావం చూపుతుంది. మెదడును వాపునకు గురిచేస్తుంది. ఫలితంగా వ్యక్తి ప్రాణాపాయంలో పడతాడు. కుక్క కరవగానే అది పెంపుడిదా? కాదా? అనేది గుర్తించాలి. పెంపుడిది అయితే యాంటీ రేబిస్ టీకా వేయించారో, లేదో తెలుసుకోవాలి. టీకా వేయించి ఉంటే ఆందోళన అక్కర్లేదు. ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు, ప్రేరేపణలు లేకపోయినా కరిస్తే అది పిచ్చిదని అనుమానించాలి. అలాంటివి కరిస్తే ఆ గాయాన్ని ధారగా కారే మంచినీటిలో శుభ్రపర్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ యాంటీ సెప్టిక్ లోషన్లు, క్రీములను పూతగా వాడొద్దు. ఉప్పు, పసుపు వంటి వాటిని పోయొద్దు. ఆ గాయాన్ని తెరిచే ఉంచాలి. తీవ్ర రక్తస్రావం లేకపోతే కుట్లు వేయడం, కట్లు కట్టడం వంటివీ చేయకూడదు. కరిచిన వెంటనే, లేదా అదే రోజు యాక్టివ్ ఇమ్యునైజేషన్ టీకాను ఇప్పించాలి. నిర్దేశిత డోసుల టీకాను తీసుకున్నప్పటికీ పాసివ్ ఇమ్యునైజేషన్ టీకాను తప్పకుండా ఇప్పించాలి. దీన్ని గాయం ఉన్న చోటే వేస్తారు. -డాక్టర్ ఎంవీ రావు, సీనియర్ జనరల్ ఫిజీషియన్
రాష్ట్ర వ్యాప్తంగా పాముకాటు కేసులు: 4,895
అత్యధికం: మహబూబ్‌నగర్ జిల్లాలో (629)
విష సర్పమైతే రెండు కాట్లు: పాము కరిచిందనే సందేహం వచ్చినప్పుడు, పక్కనున్న వ్యక్తులు ధైర్యం చెప్పడం కీలకం. కరిచింది విష సర్పమా? సాధారణమైనదా? అనేది మొదట గుర్తించాలి. విషసర్పమైతే సూదితో గుచ్చిన మాదిరిగా రెండు చోట్ల కోరల తాలూకూ గుర్తులు, రక్తపు చుక్కలు కనిపిస్తాయి. అలాంటివి గుర్తిస్తే సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. సాధారణ పాము అయితే కాట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
సత్వర చికిత్సతో రక్షించొచ్చు: నాగుపాము, కట్ల పాము కాటేసినప్పుడు ప్రధానంగా శ్వాస, నాడీ, గుండె వ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. సకాలంలో చికిత్స పొందకపోతే శ్వాస ఇబ్బందులు ఎదురై, నాడీ వ్యవస్థ దెబ్బతిని గుండె ఆగిపోతుంది. రక్తపింజర కాటేసినప్పుడు రక్తంలో ఇన్‌ఫెక్షన్ వస్తుంది. వీరికి ‘పాము కాటు విరుగుడు మందు(యాంటీ స్నేక్ వీనమ్)’ ఇంజక్షన్‌ను ఇస్తే ప్రాణాపాయం తప్పుతుంది. -డాక్టర్ కత్తి జనార్దన్, ప్రోగ్రాం అధికారి, రంగారెడ్డి జిల్లా
ఇవీ చదవండి: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు
'అత్యంత పారదర్శక వ్యవస్థల్లో ఒకటి'.. కొలీజియంను పూర్తిగా సమర్థించిన సుప్రీం