Director Shashank: రంగుల ప్రపంచం.. సినిమా అంటే చాలా మంది యువతకు ఇష్టం. తమ అభిరుచి మేరకు... నటనలో, రచనలో ప్రతిభ చాటుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలా.. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న హైదరాబాద్‌కు చెందిన శశాంక్ రామానుజపురం.. నటుడు, దర్శకుడిగా... తన లఘు చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు.
సందేశాత్మక చిత్రాలతో..
ఫోటోగ్రాఫర్‌గా స్థిరపడిన ఈ యువకుడు.. తన అభిరుచిని వదిలి పెట్టాలనుకోలేదు. స్వయంగా స్క్రిప్ట్‌లు రాసి, దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతరులకు భిన్నంగా హాస్యం, లవ్ జోనర్‌కు దూరంగా... సామాజిక, సందేశాత్మక చిత్రాలతో ఆలోచింపజేస్తున్నాడు. అలా ఇప్పటి వరకు.. 25 పైగా లఘుచిత్రాలు రూపొందించి, ప్రశంసలందుకున్నాడు. సినిమా గురించి ఏమీ తెలియని వయసులోనే.. బాపూ దర్శకత్వంలో ఈటీవీలో ప్రసారమైన భాగవతం ధారావాహికలో చిన్ననాటి బలరాముడిలా నటించాడు. అదే సినిమా, నటనలపై ఆసక్తి పెరిగేందుకు కారణమంటున్నాడు...శశాంక్. పెద్దయ్యాక.. మిస్టర్ మేధావి, ప్రభాస్ డార్లింగ్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రాలు పోషించి, నటుడిగానూ రాణించాడు.
ప్రశంసలు అందుకుంటూ..
తండ్రి కోరికతో సందేశాత్మక చిత్రాల వైపు మొగ్గు చూపిన శశాంక్... ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. రక్తదానం, అవినీతిపై తీసిన లఘుచిత్రాలకు మంచి ప్రశంసలు వచ్చాయి. డ్రంకెన్ డ్రైవ్, మాదక ద్రవ్యాలు, మహిళా వేధింపుల నేపథ్యంలో తీసిన చిత్రాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. బ్యూటిఫుల్ లైఫ్ అనే షార్ట్ ఫిల్మ్‌కు జాతీయ పురస్కారం లభించింది. అలా.. ఎస్ఎస్ రాజమౌళి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా ఎన్నో ప్రశంసా పురస్కారాలు అందుకున్నాడు.
సినిమా అవకాశాల కోసం నిర్మాతల కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. స్వశక్తితో లఘు చిత్రాలు తీస్తూ తన టాలెంట్‌ను తెరపై చూపిస్తున్నాడు. మన చుట్టూ జరగుతున్న సంఘటనల్నే ఇతివృత్తాలుగా మలిచి చిత్రాలు రూపొందిస్తున్నాడు. తాజాగా.. స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న మిషన్90 చిత్రం 60% షూటింగ్ పూర్తైంది. కొవిడ్ కారణంగా చిత్రీకరణ ఆగిపోగా, తిరిగి ప్రారంభించే పనుల్లో ఉన్నాడు శశాంక్. మంచి స్క్రిప్ట్, కంటెంట్లతో వెబ్ సిరీస్, ఓటీటీ వేదికలపై దృష్టి సారిస్తున్నాడు.
శశాంక్ సినిమా ప్రయత్నాల్లో.. అతడి జీవిత భాగస్వామి రాధిక తోడుగా నిలుస్తుండగా, సోదరి డాక్టర్ సుచరిత, సోదరుడుకు అడుగడుగునా సహకరిస్తున్నారు. వ్యాపారిగా, సామాజిక సేవకుడిగా సేవలందిస్తున్న తండ్రి వ్యాసా సైతం... కుమారుడికి చేదోడుగా నిలుస్తున్నాడు. తమ వద్ద మంచి స్క్రిప్ట్‌లు సిద్ధంగా ఉన్నాయంటున్న శశాంక్... ఆసక్తి ఉన్న నిర్మాతలు కలిస్తే తన ఆలోచనల్ని వెండి తెరపై చూపిస్తానంటున్నాడు.
ఇదీ చూడండి: 'బుల్లీబాయ్ యాప్ కేసు'లో మరొకరు అరెస్ట్.. కేసు 'ఐఎఫ్ఎస్ఓ'కు బదిలీ