Railway Act Section 153 : రైల్వేలు మన జాతీయ సంపద.. అంటే మన ఆస్తి.. వాటిపైనే మనం రాళ్లు విసరడం.. వాటి ఆస్తులను ధ్వంసం చేయడం అంటే మన ఆస్తులు మనం ధ్వంసం చేసుకోవడమే. అంతే కాదు వీటి వలన కొన్ని సార్లు మన తోటి ప్రయాణికులు, మన సొంత వారికే గాయాలవుతాయి. కొన్ని సందర్భంలో రైళ్లు రీ షెడ్యూల్తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి వాటితో రైల్వే శాఖ భారీగా నష్టపోతుంది. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కాబట్టి రైల్వే చట్టంలోని కఠిన నింబంధనలు రైల్వే శాఖ వివరించింది అవి ఎంటో ఇప్పుడు చూద్దాం..
రాళ్లు విసిరితే 5 సంవత్సరాల జైలు శిక్ష: రైళ్లపై రాళ్లు రువ్వితే.. రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హెచ్చరించింది. ప్రజా ప్రయోజనార్థం నడిచే రైళ్లపై ఎవరైనా రాళ్ల దాడిచేస్తే 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని రైల్వే అధికారులు స్పష్టంచేశారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లపై రాళ్ల దాడి ఆర్.పి.ఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హమైనదని రైల్వే శాఖ వెల్లడించింది.
రైల్వే అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రాళ్లు రువ్విన ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకున్నాయి. కాజీపేట - ఖమ్మం, కాజీపేట - భువనగిరి, ఏలూరు - రాజమండ్రి వంటి సమస్యాత్మక విభాగాలలో వందే భారత్ రైళ్లను దుండగులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ ఏడాదిలో జనవరి నుంచి మార్చి వరకు గడిచిన మూడు నెలల్లో రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు 9 వరకు జరినట్లు తెలిపారు. ఇటువంటి సంఘటనలు వల్ల విలువైన ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లిడమే కాకుండా.. రైలు రీషెడ్యూల్‌కు దారితీసినట్లు రైల్వేశాఖ తెలిపింది.
దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని వెల్లడించింది. రైలుపై రాళ్లు రువ్వడం వల్ల ఇటీవల రైలులో ప్రయాణిస్తున్న ఐదు మంది ప్రయాణికులకు తలకు రాళ్లు తగలడంతో వారు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. రాళ్లను విసరటం వల్ల రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని రైళ్లే అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి ఘటనలు జరగకుండా ఇప్పటికే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అవగాహన కల్పిస్తోందని తెలిపారు.
Railway Protection Force: ట్రాక్‌ల సమీపంలోని గ్రామాల సర్పంచ్‌లతో సమన్వయం చేయడంతో పాటు వారిని గ్రామ మిత్రలుగా చేసి ఇలాంటి ఘటనలు జరగకుండా నివారణ చర్యలను చేపడుతోందని రైల్వేశాఖ తెలిపింది. వీటితో పాటు రాళ్లు రువ్వే ప్రమాద స్థలాలన్నింటిలో కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించినట్లు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చూసిన వ్యక్తులు లేదా ప్రయాణికులు 139 రైల్వే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
ఇవీ చదవండి:
భారత్ గౌరవ్.. పూరీ - కాశీ - అయోధ్య యాత్రికుల కోసం ప్రత్యేక రైలు
రైలు ప్రయాణం వాయిదా పడిందా? ఇలా చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవ్!
విశాఖలో వందేభారత్ రైలుపై రాళ్లు రువ్విన పోకిరీలు.. అద్దాలు ధ్వంసం