తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. తెలంగాణకు జాతీయ రహదారుల విషయంలో జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 25 జాతీయ రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వగా అందులో 13 మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. మిగిలిన 12 జాతీయ రహదారులను కూడా వెంటనే మంజూరు చేయాలని కోరారు.
మంజూరైన 13 రహదారుల పనులు కూడా ఇంకా ప్రారంభం కాలేదన్న వినోద్... నంబర్లు ఇచ్చి పనుల ప్రారంభాన్ని మాత్రం మరిచారన్నారు. వాటి పనులను తక్షణమే ప్రారంభించాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలని వినోద్ కుమార్ సూచించారు. అవసరమైన భూములను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరై, ఇటీవల పూర్తైన జాతీయ రహదారులను ఈనెల 21వ తేదీన కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంభిస్తుండటం సంతోషకరమన్నారు.
ఇదీ చదవండి: 'ఈజీ లోన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త'