National Education Expo: జాతీయ విద్యా విధానంలో స్పష్టత లోపించిందని రాష్ట్ర ప్రణాళిసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. ఎన్ఈపీ అమలులో కీలక బాధ్యత పోషించాల్సిన కేంద్రం స్పష్టత ఇవ్వాలని అవసరముందన్నారు. తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం(ట్రస్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ ఎక్స్పోను ఆయన ప్రారంభించారు.
vinod kumar on NEP: జాతీయ విద్యావిధానంపై రాష్ట్రాలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఒక్కో ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని ఆక్షేపించారు. అంగన్వాడీలో ఉన్న వారిని ప్రాథమిక పాఠశాలకు తీసుకురావాలా లేదా అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదన్నారు.
విద్యారంగంపై కొవిడ్ ప్రభావం
covid effect on schools: కొవిడ్ ప్రభావం విద్యారంగంపై బాగానే పడిందని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరో తరగతి విద్యార్థి తన పేరు కూడా తెలుగులో రాయలేని పరిస్థితి ఉందని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావిధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్న ఆయన 2022-23 సంవత్సరాన్ని అభ్యాసనా నష్టాన్ని పూడ్చే ఏడాదిగా ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. రానున్న కాలంలో జనాభా పెద్ద ఎత్తున పెరగనున్న నేపథ్యంలో మరిన్ని ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
కొవిడ్ దెబ్బకు కుదేలు
covid effect on education: కొవిడ్ దెబ్బకు బడ్జెట్ స్కూళ్లు పూర్తిగా కుదేలయ్యాయని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ రావు అన్నారు. కొత్త కోర్సులు పెట్టి కొవిడ్ కారణంగా వచ్చిన అంతరాన్ని దూరం చేసి కొత్త ఉత్సాహాన్ని నింపుతామన్నారు. ఎడ్యుకేషన్ ఎక్స్పో సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఉపయోగపడేలా పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణతో పాటు దిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.