Pressmen in Delhi on Paddy Procurement in Telangana: తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే దిల్లీ వచ్చామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం దిల్లీ వెళ్లింది. అక్కడే మీడియాతో సమావేశమైంది. కేంద్రం ఇస్తున్న అనేక హామీలు అమలు కావడంలేదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. 'ధాన్యం కొనుగోలు చేస్తామని నోట మాట కాదు.. రాత పూర్వక హామీ ఇవ్వాలని' స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే పూర్తి ధాన్యం తీసుకుంటామని.. కేంద్రం రాత పూర్వకంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
''రైతుల ప్రయోజనాల కోసమే దిల్లీ వచ్చాము. తక్షణమే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వీలైనంత త్వరగా సమయం ఇచ్చి మా గోడు వినాలని కోరుతున్నాం. నిన్న రాత్రి గోయల్‌తో కేశవరావు ఫోన్లో మాట్లాడారు. పార్లమెంట్‌కు వస్తే సమయం ఇస్తానని గోయల్ తెలిపారు. నిరీక్షించేలా చేయడమంటే రైతులను అవమానించడమే. మాకు సమయం ఇచ్చి రైతుల సమస్యను వెంటనే పరిష్కరించాలి. దిల్లీకి వచ్చే ముందే కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్ కోరాం. సమస్య తీవ్రతను కేంద్రమంత్రి పరిగణనలోకి తీసుకోవాలి. ధాన్యం కొనుగోళ్లపై రాతపూర్వక ప్రకటన కావాలి.
6,952 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేశాం. కేంద్రాల్లో 12-15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది. ఇంకా కొన్ని జిల్లాల్లో వరి కోతలు జరగాల్సి ఉంది. జనవరి 15 వరకు వానాకాలం వరి కోతలు జరుగుతాయి. ఐదు లక్షల ఎకరాల్లో పంట కోతకు రావాల్సి ఉంది. ఏడాదిలో కేంద్రం ఎంత ధాన్యం తీసుకుంటారో చెప్పాలని సీఎం కోరారు.''
-మంత్రి నిరంజన్‌రెడ్డి
నేరుగా బియ్యం ఎగుమతి చేసే అధికారం రాష్ట్రానికి లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు మాత్రమే ఎగుమతి చేయగలరని.. కానీ విశాఖ పోర్టు వరకు వెళ్లి ఎగుమతి చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. మాకు సమస్య వస్తే దిల్లీ ప్రభుత్వ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాము. గోదాముల నిర్మాణంలో కేంద్రానికి ముందు చూపు లేదని ఆరోపించారు. ఈ వానాకాలం పంట సేకరణ గురించే మేము మాట్లాడుతున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వానాకాలంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొంటామని కేంద్రం చెప్పిందని... 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని కోరేందుకు దిల్లీ వచ్చామన్నారు.
ఇదీ చూడండి: TRS Protest Over Paddy Procurement : 'తెలంగాణ రైతు గోస దిల్లీకి వినిపిస్తాం'