KTR participated in Robotics Frameworks in HYD: నూతన టెక్నాలజీలు అన్నింటిని అలవాటు చేసుకునే ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రోబోటిక్స్ ఎకో సిస్టంను మెరుగుపరిచే దిశగా తెలంగాణ స్టేట్ రోబోటిక్ ఫ్రేమ్ వర్క్‌ను కేటీఆర్ టీ హబ్‌లో ప్రారంభించారు. హైదరాబాద్‌లోని టీహబ్‌లో జరిగే రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్స్ సందడిగా జరిగింది. ప్రస్తుతం సమాజంలో జరిగే చాలా సమస్యలను పరిష్కరించేందుకు రోబోటిక్స్ ఉపయోగపడుతున్నాయని కేటీఆర్ అన్నారు. అభివృద్ధిలో ఐటి వినియోగం పెంచాలని.. టెక్నాలజీని వాడాలని సూచించారు. రోబోటిక్స్ సాంకేతికత వేగంగా పెరుగుతోందని తెలిపారు. గత మూడు దశాబ్దాల్లో మూడు రెట్లు వాటి వినియోగం పెరిగిందని అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం రోబోటిక్స్ వినియోగంలో పదో స్థానంలో ఉందని గుర్తు చేశారు. త్వరలోనే ఐదో స్థానానికి చేరుకోవాలని సూచించారు. ఈ రోబోటిక్స్‌ని ప్రజా సమస్యల పరిష్కారంలో ఉపయోగించాలన్నదే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
మారుతున్న సమాజానికి అనుగుణంగా మారాలి : ప్రపంచం అంతా టెక్నాలజీతో వేగంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఈ సాంకేతిక యుగంలో ప్రతి దేశంలో రోజు రోజుకు కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సాంకేతికత ప్రతి ఒక్కరికి అవసరమని.. ఎంతో ఆసక్తిగా మారిందని వివరించారు. ఇలాంటి సమాజంలో మనమందరం జీవిస్తున్నామని చెప్పారు. ఆవిష్కరణలను, వ్యవస్థాపకులను ప్రోత్సహించడమే ఈ రోబోటిక్ ఫ్రేమ్‌వర్క్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు మారాలని సూచించారు.
సాంకేతిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది: సాంకేతిక రంగంలో వచ్చే ప్రతి కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలని అన్నారు. ఇలా వచ్చే ప్రతి కొత్త ఆవిష్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సలహా ఇచ్చారు. వచ్చే ప్రతి టెక్నాలజీని అలవాటు చేసుకునేలా తమ ప్రభుత్వం ఉండాలనుకొంటుందని మంత్రి అన్నారు. వీటి కోసమే రాష్ట్రంలో ఈ రంగంలోని పరిశ్రమలు, అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
రోబోటిక్స్ రంగాన్ని అభివృద్ధి చేస్తాం: హెల్త్ కేర్, వ్యవసాయం, కన్జ్యూమర్ రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వంటి పలు రంగాల్లో ఈ ఫ్రేమ్ వర్క్‌తో.. రాష్ట్రంలో రోబోటిక్స్ రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో రోబోటిక్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి, ఐటీ ప్రధాన కార్యదర్శి జయశంజన్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: