2015తో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రమబద్ధీకరణ చేపట్టడం... దరఖాస్తు ప్రక్రియ సులువుగా చేసినందున వాటి సంఖ్య భారీగా పెరిగింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసినందున వాటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం పురపాలకశాఖ... అవసరమైన సాఫ్ట్‌వేర్ సిద్ధంచేసింది.
క్లస్టర్లుగా విభజన...
పెండింగ్‌లో ఉన్న 2015లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు సహా... కొత్తగా వచ్చిన వాటితో కలిపి తదుపరి ప్రక్రియ చేపట్టనున్నారు. చాలాచోట్ల ప్రభుత్వ భూములు, నాలా, శిఖం, దేవాదాయ, వక్ఫ్ భూములపైనా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు వచ్చినట్లు... అధికారులు గుర్తించారు. వాటిని ముందుగా గుర్తించి తిరస్కరిస్తారు. ఆ తర్వాత మిగతా వాటిపై దృష్టిసారించనున్నారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ... క్లస్టర్లుగా విభజించనున్నారు.
ప్రత్యేక బృందాలు...
ఒకే లేఅవుట్‌లోని ప్లాట్లు, సమీపంలోని ప్లాట్లను క్లస్టర్లుగా పరిగణిస్తారు. ఆయా లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేస్తారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు నియమిస్తారు. బృందాలకు దరఖాస్తుల ప్రక్రియను క్లస్టర్లవారీగా అప్పగిస్తారు. దరఖాస్తు సమయంలో సేల్‌డీడ్ తొలిపేజీని తీసుకున్నందున ఆ డీడ్ ఆధారంగా రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉన్న పూర్తి వివరాలు తీసుకుంటారు. ఆ సమాచారం మేరకు దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను చేపట్టనున్నారు. అవసరమైతే దరఖాస్తుదారు నుంచి అదనపు సమాచారం, వివరాలు తీసుకుంటారు.
అవసరమైన జాగ్రత్తలు...
దరఖాస్తుల ప్రక్రియ కోసం సాఫ్ట్‌వేర్ సిద్ధమైనందున త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేసి... ఏస్థాయిలోనూ ఎవరికి ఎలాంటి విచక్షణాధికారాలు లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీలైనంత వరకు కార్యాలయాలకు దరఖాస్తుదారు వెళ్లకుండా చూడాలని పురపాలకశాఖ భావిస్తోంది. అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధరించుకున్నాక క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుదారు చెల్లించాల్సిన మొత్తాన్ని మొబైల్‌నంబర్‌కు సంక్షిప్త సందేశం ద్వారా పంపనున్నారు.
మొబైల్కు పంపేలా ఏర్పాట్లు...
ఆన్‌లైన్‌లో ఆ మొత్తాన్ని చెల్లిస్తే ప్రక్రియను పూర్తి చేసి క్రమబద్ధీకరించిన విషయాన్ని... తిరిగి మొబైల్‌నంబర్‌కు పంపేలా ఏర్పాటు చేస్తున్నారు. భవననిర్మాణ అనుమతుల కోసం త్వరలో టీఎస్-బీపాస్ అమల్లోకి రానున్నందున... అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్ ఉన్న ప్లాట్లకు తక్షణ అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇన్‌స్టంట్ అప్రూవల్‌తో పాటు ఇన్‌స్టంట్ ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చేఅంశాన్ని పురపాలకశాఖ పరిశీలిస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్ తప్పనిసరి చేసినందున... పంచాయతీల్లోనూ టీఎస్-బీపాస్ అమలు ప్రక్రియ సులువవుతుందని అంటున్నారు.
ఇదీ చూడండి: ధరణి లాంటి పథకం ప్రపంచంలోనే ఉండదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్