కొవిడ్ పాఠాలతో భవిష్యత్ కోసం వైద్య సేవలను విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అయింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 వైద్య కళాశాలలు, 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 14 నర్సింగ్ కళాశాలలను ప్రీకాస్ట్ ఇంజినీరింగ్ విధానం(Precast Policy)లో త్వరితగతిన నిర్మించేందుకు నిర్ణయించింది. వీటిలో రెండు మూడు మినహా మిగిలిన అన్నింటికీ టెండర్లు పిలిచింది. ఈ రంగంలో మౌలిక సదుపాయాలకు దశలవారీగా రూ.పది వేల కోట్లు వెచ్చించబోతోంది.
ఒక్కో కళాశాలకు రూ.500 కోట్లు..
నాగర్‌కర్నూల్, వనపర్తి, సంగారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల, రామగుండం, మహబూబాబాద్, ఖమ్మంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరంలోనే వీటిలో తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొత్తగా 1,200 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రీకాస్ట్ విధానంలో నాలుగు నెలల వ్యవధిలో తొలి అంతస్తును సిద్ధం చేయాలని, అనంతరం తరగతుల నిర్వహణకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. రెండో సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి తెస్తారు. ఒక్కో వైద్య కళాశాలను పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మించేందుకు సుమారు రూ.500 కోట్లు, ఒక్కో నర్సింగ్ కళాశాల నిర్మాణానికి రూ.40 కోట్లు వ్యయం చేయనున్నారు.
మరికొన్ని ఆసుపత్రులకూ...
వరంగల్, హైదరాబాద్ ఛాతీ ఆసుపత్రి, అల్వాల్, గడ్డిఅన్నారంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఒక్కో ఆసుపత్రికి రూ.వెయ్యి కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. వరంగల్ మినహా మిగిలిన ఆసుపత్రులు ఒక్కోటి 1,500 పడకలతో సిద్ధం చేయనున్నారు. గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిని విస్తరించాలని, నిమ్స్‌ని ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విదేశీ నిపుణుల సేవలు..
వైద్య రంగంలో వినూత్న విధానాలను అవలంబించాలని ప్రభుత్వం భావిస్తోంది. వైద్య విద్యను మరింత పటిష్ఠం చేసేందుకు విదేశాల్లోని నిపుణుల సేవలు వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేశవిదేశాల్లో విశేష గుర్తింపు పొందిన వైద్యులతో రాష్ట్రంలోని విద్యార్థులకు 1-2 నెలల పాటు నైపుణ్య శిక్షణ ఇప్పించే అంశంపైనా ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీనిపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: TRS Party 20 Years celebrations : తెరాస 20 ఏళ్ల ప్రస్థానం: పోరాట పంథా నుంచి.. ప్రగతి పథంలోకి...