గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధితో సమావేశమయ్యారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల నాటి వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లను రానున్న ఎన్నికల్లోనూ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపిన అధికారులు.. ఆ ప్రతులను ఎస్ఈసీకి అందించారు. ఇటీవలి చట్టసవరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు రానున్న ఎన్నికల్లోనూ రెండో దఫాగా అమలవుతాయని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితా తయారీకి ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 జనవరి ఒకటి అర్హత తేదీగా శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాల ఆధారంగా జీహెచ్ఎంసీ వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితా తయారీకి ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ ఏడున వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా ముసాయిదాలను ప్రకటించాలి. మరుసటి రోజు నుంచి నవంబర్ 11 వరకు ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.
ఓటర్ల జాబితా ముసాయిదాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీహెచ్ఎంసీ కమిషనర్ సమావేశమవుతారు. ఈ నెల 10న జీహెచ్ఎంసీ సర్కిళ్ల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిప్యూటీ కమిషనర్లు సమావేశమవుతారు. ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాలను డిప్యూటీ కమిషనర్లు నవంబర్ 12లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. వార్డుల వారీ ఫొటో ఓటర్ల తుది జాబితాలను 13న ప్రకటించాల్సి ఉంటుంది. తుది జాబితా ప్రకటించిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు జాబితాలో చేర్పులు, తొలగింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం ఇస్తుంది.
జీహెచ్ఎంసీ కమిషనర్ సహా యంత్రాంగమంతా ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎన్నికల ప్రక్రియపై దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. ఓటర్ల జాబితాలో కచ్చితత్వం ఉంటే ఎన్నికలు సాఫీగా జరుగుతాయన్న ఆయన.. పూర్తి జాగ్రత్తతో జాబితాను పకడ్బందీగా తయారు చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: దుబ్బాక ఉపఎన్నికలో వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్