హైదరాబాద్ ప్రగతిభవన్లో ఈ నెల 11న సాయంత్రం 5 గం.కు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నీటిపారుదల శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇటీవల సీఎం నిర్వహించిన సమీక్షలో నీటి పారుదల శాఖకు సంబంధించి కొత్తపనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దుమ్ముగూడెం వద్ద 37 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వీలుగా ఆనకట్ట నిర్మించాలని సీఎం ఇటీవల నిర్ణయించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ప్రస్తుతం రోజుకు రెండు టీఎంసీల నీరు ఎత్తిపోస్తుండగా... వచ్చే ఏడాది నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోసేలా అదనపు పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ పనులకు 13,500 నుంచి 14,000 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందని అంచనా. ఈ పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.
కాళేశ్వరం జలాలను బస్వాపూర్, అసిఫ్ నహర్, పానగల్ వాగు ద్వారా పెద్దదేవులపల్లి జలాశయానికి తరలించే ప్రతిపాదనలపైనా చర్చించనున్నారు. నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ సహా అన్ని అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కొత్త రెవెన్యూ చట్టంపైనా చర్చించే అవకాశం ఉంది. చట్టానికి ఆమోదం లభిస్తే శాసనసభా సమావేశాల విషయమై కూడా చర్చించనున్నారు.
ఉద్యోగులకు వేతన సవరణ, ఇతర హామీల విషయమై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు దిశ ఉదంతం, తదనంతర పరిణామాలు, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు, పురపాలక ఎన్నికలు, ఇతర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఇవీ చూడండి:'రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలి'