రాష్ట్రంలో లాక్డౌన్ను సంపూర్ణంగా ఎత్తివేస్తూ రాష్ట్ర మంత్రివర్గం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే జులై ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలను పున:ప్రారంభించాలని నిర్ణయించింది. అన్ని కేటగిరీల విద్యాసంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా అన్ని విద్యాసంస్థలు, కోచింగ్ కేంద్రాలను వచ్చే నెల 1 నుంచి తెరిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు వీలుగా సన్నద్ధం చేయాలని తెలిపింది. విద్యాసంస్థలు పున:ప్రారంభం అవుతున్ననేపథ్యంలో.. విద్యార్థుల హాజరు, ఆన్లైన్ క్లాసుల కొనసాగింపు, తదితర నిబంధనలు, విధివిధానాలకు సంబంధించిన ఆదేశాలను విడుదల చేయాలని విద్యాశాఖకు మంత్రివర్గం స్పష్టం చేసింది.
సోమవారం విధివిధానాలు..
కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో విధివిధానాల ప్రకటనకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఇందుకోసం సోమవారం అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. పాఠశాలలు, కళాశాలల నిర్వహణ, తరగతులు నిర్వహించాల్సిన విధానం తదితరాలపై చర్చించనున్నారు. ప్రత్యక్ష తరగతులకు విద్యార్థుల హాజరు, ఆన్లైన్ క్లాసుల కొనసాగింపు, తదితర అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారు. ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు తల్లిదంద్రుల అంగీకారాన్ని తప్పనిసరి చేయనున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తరగతుల నిర్వహణా విధానంపై విద్యాశాఖ విధివిధానాలు ఖరారు చేసి ఆదేశాలు జారీ చేయనుంది.
మార్చి నెలలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులకు తరగతి గదుల్లో బోధన చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులు పెద్దఎత్తున వైరస్ బారినపడ్డారు. చూస్తుండగానే మహమ్మారి విద్యార్థులపై తన పంజా విసిరింది.
ఉపాధ్యాయసంఘాల హర్షం
దీంతో ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేసింది. కొన్ని పరీక్షలను రద్దు చేసింది. ఇందులోనే వేసవి సెలవులు కలిసి రావడంతో ఈ నెల 15 వరకు సెలవులను పొడిగిస్తూ వచ్చింది. తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ విద్యాసంస్థలు తెరవాలని శనివారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వచ్చే నెల 1 నుంచి తరగతి గదుల్లో ప్రత్యక్ష బోధన జరగాలని ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విధివిధానాలు వెల్లడించనున్నారు.
మరోవైపు విద్యాసంస్థలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపాయి.
ఇదీ చూడండి: జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని నిర్ణయం