Police Investigation on Alakanandha Kidney Racket : కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఘరానా అంతర్రాష్ట్ర ముఠా వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ ముఠాకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హైదరాబాద్‌తో సంబంధాలున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో అరెస్టయిన వారిలో పోలీసులు పది మందిని కస్టడీకి కోరారు. వారిని విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.5 లక్షలు : కిడ్నీ రాకెట్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో 13 మందిని నిందితులుగా పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడు విశాఖపట్నంకు చెందిన వైద్యుడు రాజశేఖర్‌కు ఇంకా ఎవరెవరితో సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వైద్యుడు రాజశేఖర్ 2023 మేలో విశాఖపట్నంలో ఇదే తరహా కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు మౌనంగా ఉన్న అతను తిరిగి అక్రమ దందా ప్రారంభించినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
రాజశేఖర్ ఓ వైద్య కళాశాలలో పని చేస్తున్నట్టు విచారణలో తేలింది. గతంలో జనని, అరుణ ఆసుపత్రుల్లో కూడా 30కి పైగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు చేసినట్టు పోలీసులు గుర్తించారు. సరూర్ నగర్‌లోని అలకనంద ఆసుపత్రిలో 12 కిడ్నీ మార్పిడి చికిత్సలు చేసినట్టు పోలీసులు తెల్చారు. ఒక్కో మార్పిడికి 5 లక్షల రూపాయలు తీసుకున్నట్టు బయటపడింది.
రెండు, మూడు రోజుల్లో కోర్టు నిర్ణయం : ఈ కేసులో కీలక నిందితుడు రాజశేఖర్‌ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే కిడ్నీ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరున్నారు, హైదరాబాద్‌లో ఇంకా ఎక్కడైనా ఈ తరహా మార్పిడులు నిర్వహించారా అనే కోణాల్లో పది మంది నిందితులను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. వారిని పది రోజులు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును అభ్యర్ధించారు. పోలీసుల అభ్యర్ధనపై రెండు, మూడు రోజుల్లో కోర్టు నిర్ణయం తీసుకోనుంది. నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే ఈ కిడ్నీ రాకెట్ విషయంలో కొత్త విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
విశాఖతో కిడ్నీ రాకెట్ లింకులు - ఇంకా మిస్టరీగానే ఆ అంశం!
దేశవ్యాప్తంగా కిడ్నీ రాకెట్ దందా! - అలకనంద ఆసుపత్రి కేసులో సంచలన విషయాలు