తెరాస ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నేతలపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్.. బలహీన వర్గాలపై అణచివేత చర్యలను తక్షణమే మానుకోవాలని హెచ్చరించారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెరాస అనుసరిస్తోన్న బలహీన వర్గాల వ్యతిరేక విధానాలపై బస్సు యాత్రను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈటల రాజేందర్ శాఖను తొలగించడాన్ని.. బడుగుల బిడ్డను కించపరిచినట్లుగా భావిస్తున్నామంటూ జూజుల ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి భూ కబ్జా చేయలేదని స్థానిక సర్పంచ్ మీడియా ద్వారా వెల్లడించినప్పటికీ.. నివేదిక రాకముందే పదవి నుంచి తొలగించడం గమనిస్తే.. కేసీఆర్‌కు బీసీల పట్ల ఉన్న గౌరవమేంటో స్పష్టమవుతోందన్నారు. రాబోయే రోజుల్లో బలహీన వర్గాలకు చెందిన మిగతా మంత్రులపై కూడా ఇదే విధంగా వ్యవహరించే అవకాశాలున్నాయని వివరించారు. అగ్ర కులాల జోలికి వెళ్లే ధైర్యం ప్రభుత్వానికి లేదంటూ.. పార్టీకి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని విమర్శించారు.
సీఎం కేసీఆర్.. ఉప, పుర ఎన్నికలు పూర్తి కాగానే ఈటలను దొంగ దెబ్బ తీశారంటూ జాజుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పార్టీ జెండాలు మోయడానికి మాత్రమే పనికి వస్తామా అని ప్రశ్నించారు. పార్టీలోని వార్డు సభ్యులు మొదలుకొని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజాప్రతినిధులంతా కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన విన్నవించారు.
ఇదీ చదవండి: ఈటల రాజేందర్ భూముల వ్యవహారంపై సీఎస్‌కు మెదక్ కలెక్టర్ నివేదిక