కరోనా నేపథ్యంలో మార్చిలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచనల మేరకు వచ్చే నెల రెండో వారంలో మిగిలిన పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పరీక్ష కేంద్రంలో ఎడం పాటించేలా గదుల్లో 10 లేదా 12 మంది విద్యార్థులు కూర్చునే ఏర్పాట్లు చేశారు. ఇందుకు అనుగుణంగా పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగింది.
గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 761 కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1,506కు చేరింది. గతంలో కేంద్రాలు ఉన్న ప్రాంగణంలోనే అదనపు గదులను ఏర్పాటు చేశారు. అక్కడ సరిపోని పక్షంలో సమీపంలోని మరో పాఠశాలలో పరీక్ష కేంద్రం పెట్టారు. ఇలా హైదరాబాద్ జిల్లాలో 69 కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో 83, మేడ్చల్ జిల్లాలో 15 కేంద్రాలు కొత్తగా ఏర్పాటయ్యాయి.
ఆయా కేంద్రాల్లో విద్యార్థులను పాత హాల్‌టికెట్లతో పరీక్షలు రాయించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీరికి పరీక్ష కేంద్రం మారినా కొత్తగా ఎలాంటి హాల్‌టికెట్ జారీ చేయరు. ఇలా కొత్తగా ఏర్పాటైన పరీక్ష కేంద్రాల్లో ఏ విద్యార్థులను కేటాయించారన్న విషయంపై నెలాఖరులో స్పష్టత ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో ముందుగానే విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలను మరోసారి తనిఖీ చేసుకునే వీలుంటుంది. అలాగే ఆయా పరీక్ష కేంద్రాలన్నీ గతంలో ఉన్న కేంద్రాలకు సమీపంలోనే ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిణి బి.వెంకటనర్సమ్మ వివరించారు.