తిరుమల శ్రీవారి దర్శన ఆన్‌లైన్ టికెట్లను పెంచే యోచన లేదని.. కరోనా తీవ్రత తగ్గాకే సర్వదర్శనం ప్రారంభంపై ఆలోచిస్తామని తితిదే స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్, ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఉదయం ఆయన సీఈ నాగేశ్వరరావు, సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టితో కలిసి పరిశీలించారు. గతంలో సర్వదర్శనం టికెట్లను జారీచేయగా భక్తులు పెద్దఎత్తున గుంపులుగా చేరారని ఈవో గుర్తుచేశారు. కరోనా పాజిటివిటీ రేటు ఒకశాతం లోపునకు వస్తే శ్రీవారి దర్శన టికెట్ల పెంపుపై ఆలోచిస్తామని స్పష్టంచేశారు. తిరుమలలో కాటేజీల ఆధునికీకరణను వేగవంతం చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఆశగా నిరీక్షిస్తున్నారు
తిరుమల(Tirumala) శ్రీవారి సర్వదర్శనం కోసం సామాన్య భక్తులు ఆశగా నిరీక్షిస్తున్నారు. కరోనా మొదటి దశ సమయంలో గతేడాది మార్చి 20 నుంచి జూన్ 8వ తేదీ వరకు దాదాపు 80 రోజుల పాటు భక్తులకు దర్శనాలను నిలిపివేసి శ్రీవారి కైంకర్యాలను తితిదే ఏకాంతంగా నిర్వహించింది. కరోనా రెండో దశ ప్రభావంతో ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు సర్వదర్శనం టికెట్లను జారీ చేయలేదు. దీంతో పేద, సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరమయ్యారు.
అంతర్జాలంపై అవగాహన లేక
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నందున.. అంతర్జాలంపై అవగాహన లేని భక్తులు, పేదలు నేరుగా వచ్చి తిరుపతిలో సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్లను పొందేందుకు ఆశగా నిరీక్షిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి ఆన్‌లైన్ టికెట్ల కోటాను పెంచాలని ఇప్పటికే భక్తుల విన్నపాలు పెరుగుతున్నాయి. మరోవైపు స్వామి దర్శనానికి మేలో రోజుకు అత్యల్పంగా 2 వేలలోపే భక్తులు వచ్చారు. జూన్‌లో ఇప్పటివరకు రోజుకు సరాసరి 18 వేలకుపైగా భక్తులు దర్శించుకుంటున్నారు. ఆన్‌లైన్ టికెట్ల పెంపుతో పాటు, సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్ల జారీపై తితిదే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
శ్రీవారి ప్రసాదం జిలేబీ, మురుకుల ధర పెంపు
శ్రీవారి ప్రసాదమైన జిలేబీ, మురుకుల ధరను తితిదే పెంచింది. ప్రతి గురువారం తిరుప్పావడ సేవలో పాల్గొనే భక్తులకు వీటిని ఇస్తుంటారు. మిగిలిన ప్రసాదాలను వివిధ విభాగాల్లోని వారికి విచక్షణ కోటా కింద రూ.100కి ఇస్తున్నారు. వీటి ధరను రూ.100 నుంచి రూ.500కు ధర పెంచుతూ తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు.
శ్రీవారి ఆర్జితసేవా భక్తులు దర్శనం వాయిదా వేసుకోవచ్చు
శ్రీవారి ఆర్జితసేవా(వర్చువల్) టికెట్లు కలిగిన భక్తులు.. స్వామివారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశాన్ని తితిదే కల్పించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి జూన్ 30 తేదీల మధ్య వరకు వర్చువల్ సేవా టికెట్లు పొందిన భక్తులు బుకింగ్ తేదీ నుంచి ఏడాదిలోపు ఎప్పుడైనా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు.
ఇదీ చూడండి. నేరగాళ్ల అభయారణ్యం- ఆగని అత్యాచారాలు!