Srinivas Goud Election Affidavit Tampering Controversy Case Update : ఎన్నికల అఫిడవిడ్ టాంపరింగ్ వివాదంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులపై మహబూబ్‌నగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో అదే ప్రాంతానికి చెందిన చలువగాలి రాఘవేందర్ రాజు నమోదు చేసిన ప్రైవేటు పిటిషన్‌పై మహబూబ్‌నగర్ మూడవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయసలహా అందిన అనంతరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో 21 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 241/2023 నంబర్‌తో ఎఫ్ఐఆర్ నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తునట్లు ఎఫ్.ఐ.ఆర్‌లో పేర్కొన్నారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు 11 మంది సభ్యులు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యదర్శి సంజయ్ కుమార్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్, రాష్ట్ర ఆర్ధికశాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, అప్పటి ఆర్డీఓ శ్రీనివాస్, ఐటీ బృంద సభ్యుడు వెంకటేష్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ పద్మశ్రీ, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రావు, న్యాయవాది రాజేంద్ర ప్రసాద్, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి సుధాకర్‌లపై కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల అఫిడవిడ్ టాంపరింగ్(Election Affidavit Tampering)కు పాల్పడ్డారంటూ మహబూబ్ నగర్‌కు చెందిన పిటిషనర్ రాఘవేంద్రరాజు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Election Affidavit Tampering Contraversy Case Update : ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో సహా అప్పడు విధుల్లో ఉన్న ఎన్నికల అధికారులు, రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని మహబూబ్ నగర్ రెండో పట్టణ ఎస్.హెచ్.ఓకు ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు 2న కోర్టు ఉత్తర్వులు పోలీసులకు చేరాయి. దీనిపై న్యాయసలహా తీసుకున్న అనంతరం శుక్రవారం కేసు నమోదైంది. మరోవైపు కేసు నమోదు చేయలేదని పిటిషనర్ శుక్రవారం తిరిగి నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు ఫిర్యాదు చేశారు.
పన్నీర్ సెల్వం కుమారుడికి బిగ్ షాక్.. ఎంపీ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు
Election Affidavit Tampering Case Update : మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా.. రాష్ట్ర మంత్రిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్ 2018లో ఎన్నికల అఫిడవిట్ సమర్పించినప్పుడు తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని సీహెచ్ రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని ధర్మాసనాన్ని కోరారు.