Spouse Teachers Meet Ministers: దంపతులను ఒకే చోట పని చేసేలా బదిలీలు చేపట్టాలని.. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరానికి ఉపాధ్యాయ దంపతులు వచ్చారు. తమకు న్యాయం చేయాలని పలువురు మంత్రులను వేడుకున్నారు. అనంతరం మంత్రులకు వినతిపత్రాలు అందించారు. తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
భార్యభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు.. అందరి ఉపాధ్యాయ దంపతులకు వర్తించడం లేదని స్పౌజ్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ దంపతులకు మాత్రమే బదిలీలు చేపట్టి.. ఎస్జీటీ, లాగ్వేజ్ పండితులు, పీఈటీ ఉపాధ్యాయ దంపతులకు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై న్యాయం చేయాలని మంత్రులు, లక్డికాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం చుట్టూ.. గత పది రోజులుగా తిరుగుతున్న సంబంధిత అధికారులు, మంత్రులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక దగ్గర పని చేస్తేనే ఉత్పాదకత పెరుగుతుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పలుమార్లు పేర్కొనడం జరిగిందని ఉపాధ్యాయ దంపతులు గుర్తుచేశారు. గతేడాది 19 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు జరిపి.. 13 జిల్లాలను బ్లాక్లో ఉంచడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం కాలంగా స్పౌజ్ ఫోరం సభ్యులు చేస్తున్న ఆవేదన కార్యక్రమాలు, మౌన దీక్షలు, వినతి పత్రాలతో సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఈ సమస్యకు పరిష్కారం చూపి ముందుకు రావడం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే ఇటీవల 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను చేపట్టడం జరిగిందని.. కానీ 2100 అప్లికేషన్లలో కేవలం 30శాతం మాత్రమే బదిలీలు చేపట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే సాకు చూపించి ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితుల బదిలీలను నిలుపుదల చేయడంపై వారు నిరసన వ్యక్తం చేశారు.
వాస్తవంగా ఎస్జీటీ విభాగంలో ప్రస్తుతం పెద్ద మొత్తంలో ఖాళీలు ఉన్నాయి.. ప్రస్తుత ప్రమోషన్ల తర్వాత ఇంకా ఎక్కువ ఖాళీలు ఏర్పడనున్నాయని ఉపాధ్యాయ దంపతులు పేర్కొన్నారు. ఇందులో 80శాతం నుంచి 90శాతం వరకు ఇబ్బంది పడుతున్నది మహిళా ఉపాధ్యాయులేనని తెలిపారు. ప్రతిరోజు 150 నుంచి 200 కిలోమీటర్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ.. ఇటు కుటుంబానికి అటు వృత్తికి దూరమై తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నామని వాపోయారు. తక్షణమే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ఈ సమస్యకు సాధ్యమైనంత తొందరగా పరిష్కరించగలరని వారు వేడుకున్నారు.
"సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే గత సంవత్సర కాలం నుంచి స్పౌజ్ ఉపాధ్యాయ బదిలీలను చేపట్టాలని కోరుకున్నాము. అయితే వీటి గురించి సీఎం స్పందించి తక్షణమే బదిలీలు చేపట్టమని ఆర్డర్ ఇచ్చారు. ఇందుకు ఎంతగానో సంతోషిస్తున్నాము. మిగిలిన స్పౌజ్ ఉపాధ్యాయ బదిలీలను తక్షణమే పూర్తి చేసి మాకు అండగా నిలవాలని కోరుతున్నాము." - ఉపాధ్యాయుడు
ఇవీ చదవండి: