Training for Terrace Gardening : హైదరాబాద్‌లో టెర్రస్ గార్డెనింగ్ నిర్వహణ పట్ల సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. డాబాలు, బాల్కనీల్లో అనేకమంది కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు పెంచుకుంటున్నారు. ఉద్యాన శాఖ దశాబ్దకాలంగా ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ నగర సేద్యంపై అవగాహన కల్పిస్తోంది. ఇటీవల నాంపల్లిలోని ఉద్యాన శిక్షణ సంస్థలో టెర్రస్ గార్డెనింగ్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. జంట నగరాల నలుమూలల నుంచి ఔత్సాహికులు హాజరై.... ఉద్యాన శాఖ నిపుణుల సలహాలు, సూచనల ద్వారా అవగాహన పెంచుకున్నారు. విత్తనాలు మొదలకుని వివిధ రకాల టెర్రస్ గార్డెనింగ్‌లపై విస్తృత అవగాహన పెంచుకున్నామని... శిక్షణ శిబిరానికి హాజరైనవారు చెబుతున్నారు.
శిక్షణా కార్యక్రమానికి హాజరుకావడం చాలామంచి అడ్వాంటేజ్. ట్రైనింగ్ వల్ల ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి. విత్తనాలు, మొక్కల ఎంపిక వంటివి తెలియజేస్తున్నారు. వీటన్నింటిపై మంచి అవగాహన కల్పిస్తున్నారు.
- టెర్రస్ గార్డెన్ నిర్వాహకులు
నాకు టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. నేను రకరకాల మొక్కలు పెంచుతున్నాను. అయితే దీనిపై కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఈ శిక్షణా కార్యక్రమానికి వచ్చాను. చాలా విషయాలు కూడా నేర్చుకున్నాను.
- టెర్రస్ గార్డెన్ నిర్వాహకులు
సమగ్ర అవగాహన
నగర సేద్యం చేసేవారికి ఉద్యాన శాఖ 50 శాతం రాయితీ అందజేస్తుండటంతో అనేకమంది టెర్రస్ గార్డెనింగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉద్యానశాఖ శిక్షణలో విత్తనాలు, పంటల ఎంపిక, ఎరువుల తయారీ, మట్టి మిశ్రమం తయారీ, చీడపీడలు రాకుండా నిర్వహించడం తదితరాలపై.... సమగ్రంగా వివరించారని చెబుతున్నారు.
మన టెర్రస్ గార్డెన్లో మట్టి మిశ్రమం చాలా ముఖ్యం. కంపోస్ట్ వంటివి ఇంట్లో తయారు కోవడం చెప్పారు. ఎలాంటి మొక్కలను ఎలా పెంచాలో చెప్పారు. వర్టికల్ ఫామింగ్ గురించి కూడా వివరించారు. చాలామంచిగా అనిపించింది.
- టెర్రస్ గార్డెన్ నిర్వాహకులు
మేము రెండేళ్ల నుంచి టెర్రస్ గార్డెన్ వేశాం. మొక్కలు బాగా వచ్చాయి. కానీ చీడపీడలు వచ్చాయి. అందుకే శిక్షణ ఇస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాం. ట్రైనింగ్‌లో చాలా వివరించారు. టెర్రస్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఎటువంటి మొక్కలు ఎంచుకోవాలనే విషయాలని తెలియజేశారు.
- టెర్రస్ గార్డెన్ నిర్వాహకులు
ఆరోగ్యకర జీవనం కోసం ఓ వ్యాపకం
ఉద్యానశాఖ 2012 నుంచి ప్రతినెల రెండుసార్లు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 30వేల మందికి అవగాహన కల్పించామని అధికారులు చెబుతున్నారు. ప్రతి సదస్సుకు కనీసం 80 నుంచి 100 పైగా మందికి పైగా ఔత్సాహికులు వస్తున్నారని వివరిస్తున్నారు. టెర్రస్ గార్డెనింగ్‌ను ఓ వ్యాపకంగా మార్చుకోవడం ద్వారా ఆరోగ్యకర జీవితం గడపొచ్చని వివరిస్తున్నారు.
హైదరాబాద్‌లో సుమార్ పదివేల ఇళ్లలో టెర్రస్ గార్డెన్ ఉంది. సేంద్రియంగా కూరగాయలు పండించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉంటాం. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
-యాదగిరి, ఉద్యాన శాఖ నగర సేద్యం విభాగం సహాయ సంచాలకులు
టెర్రస్ గార్డెనింగ్ నిర్వహణ పట్ల శాస్త్రీయపరమైన శిక్షణ కోసం ఔత్సాహికులు హైదరాబాద్ నాంపల్లి ఉద్యాన శిక్షణ సంస్థ కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఈ నెల 26న నగరసేద్యంపై శిక్షణ కార్యక్రమం జరగనున్న దృష్ట్యా పెద్ద సంఖ్యలో హాజరై... తమ సందేహాలు తీర్చుకోవాలని ఉద్యాన శాఖ పిలుపునిస్తోంది.
ఇదీ చదవండి: terrace gardening: మెుక్కలంటే ప్రాణం.. ఇంటి ఆవరణమంతా పచ్చదనం!