తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ (telangana state congress ) నాయకుల మధ్య విబేధాలు చిలికి చిలికి గాలివానలా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మంది పార్టీని వీడడంతో... ప్రతిపక్ష హోదాను కూడా కాంగ్రెస్ కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో దేనిలో కూడా ఫలితాలు ఆశించిన మేర రాలేదు. నాయకుల మధ్య విభేదాలు... పార్టీని బలోపేతం చేసేందుకు చేసే కార్యక్రమాల కంటే... ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ హైకమాండ్‌కు లేఖలు రాసుకోవడంలో ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. బయటకు అంతా సవ్యంగా ఉన్నట్లు కనిపించినా... నివురుగప్పినా నిప్పులా నాయకుల మధ్య విబేధాలు ఉన్నాయి. పార్టీపరంగా తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు చొరవ చూపరు కానీ... తీసుకున్న నిర్ణయాలపై లోపాలను ఎత్తి చూపేందుకు ఎక్కువ మక్కువ చూపుతారనే ప్రచారం జరుగుతుంది. ఆయా కారణాలతో పార్టీ ఒక అడుగు ముందుకు... నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.
ఎప్పుడూ లేనిది.. ఇప్పుడే ఎందుకు..
వరుస ఓటమిలు చవిచూసినప్పటికీ...సమీక్షలు ఉండేవి కావు. కానీ పీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (tpcc president revanth reddy) పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నిక హూజూరాబాద్ (huzurabad by election). ఇక్కడ అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు అధిష్ఠానం ఆదేశాలతోనే కొనసాగాయి. అయినా హుజూరాబాద్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. ఈ పరాజయానికి బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి... ఫలితాలు వచ్చిన వెంటనే ప్రకటించారు. ఫలితాలు తమను బాధించాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి...లోటుపాట్లను సవరించుకుని ముందుకెళ్తామని స్పష్టం చేశారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించి అందులో కూడా ఇదే అంశంపై సమీక్ష కూడా చేశారు.
అక్కడా.. అదే తీరు
అయినా కూడా కొందరు సీనియర్ నాయకులు సోనియాగాంధీకి (Sonia Gandhi) లేఖ రాసి...కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిర్ధిష్టమైన ఓటు కూడా పార్టీకి రాలేదని... దీనిపై సమీక్ష నిర్వహించాలని కోరారు. దీంతో శనివారం రోజున... దిల్లీలో అధిష్ఠానం వద్ద జరిగిన సమీక్ష సమావేశంలోనూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం పార్టీలో ఐక్యత ఎంత మేర ఉన్నదనేది బహిర్గతమవుతోంది.
అధిష్ఠానం సమక్షంలోను పరస్పర ఆరోపణలు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సక్రమంగా తన బాధ్యతలు నిర్వర్తించకపోవడం వల్లనే ఘోర పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చిందనే వాదనను పార్టీ నాయకులు హైకమాండ్‌కు వినిపించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. కాని...అక్కడికి వెళ్లిన తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (kc venu gopal) సమక్షంలోనే సీనియర్ నేతలు కొందరు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో వాడీవేడీగా సాగింది. రోజంతా జరిగిన సమీక్ష సమావేశంలో...నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలు, అభిప్రాయాలు విన్న తరువాత....కేసీ వేణుగోపాల్ గట్టి హెచ్చరికలు చేశారు.
అలా చేస్తుంటే నష్టపోయేది మీరే..
పార్టీని బలహీన పరిస్తే తీవ్రంగా నష్టపోయేది రాష్ట్ర కాంగ్రెస్ నేతలేననే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. నాయకుల మధ్య ఇప్పటికైనా ఐక్యతరాగం వచ్చి...పార్టీ బలోపేతానికి కృషి చేస్తే రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు ఆశించొచ్చన్నారు. ఆధిపత్యం కోసం కాకుండా పార్టీకోసం ప్రతి ఒక్కరు పని చేయాలని దిశనిర్దేశం చేశారు. అదే విధంగా ఎవరైనా పార్టీకి నష్టం కలిగించేట్లు బయట మీడియాతో మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ చేసిన హెచ్చరికలతో పార్టీ నాయకుల్లో మార్పు వస్తుందా....వాటి ఫలితాలు ఏలా ఉంటాయి.....నాయకుల మధ్య ఐక్యతరాగం వస్తుందా....పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పని చేస్తారా...తదితర వాటిపై స్పష్టత రావాలంటే...కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.
ఇదీ చూడండి: congress leaders meeting in Delhi: విమర్శలతో వేడెక్కిన కాంగ్రెస్ వార్ రూమ్..