పర్యాటకులకు హైదరాబాద్ పేరు వింటేనే మదిలో చార్మినార్, మక్కామసీదు కట్టడాలు గుర్తుకు వస్తాయి. ఎంతో ఘనచరిత్ర గల హైదరాబాద్‌లో పాతబస్తీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. చారిత్రక కట్టడాలన్నీ అధికశాతం పాతబస్తీ పరిధిలోకే వస్తాయి. పర్యాటకులు హైదరాబాద్‌కు చేరుకోగానే మొట్టమొదటగా పర్యటించే ప్రాంతం చార్మినార్. ఆ తర్వాతనే మిగతా ప్రాంతాలకు వెళుతుంటారు.
అభివృద్ధిలో అథమం...
ఎంతో ఘనచరిత్రగల వారసత్వ నగరంలో అభివృద్ధిలో మాత్రం అథమం. చారిత్రక నిర్మాణాలకు వెళ్లాలంటే అవసరమైన రహదారులను పట్టించుకొనే నాథుడే లేడనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. రోజురోజుకు ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ అవసరానికి అనుగుణంగా రహదారుల వెడల్పు, కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం.. ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇరుకైన రహదారులు ఉండటం వల్ల రవాణా సౌకర్యం అంతంత మాత్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు.
రహదారుల దుస్థితి అధ్వానం...
పురానాపూల్, లక్డీకాపూల్, నయాపూల్ ప్రాంతం నుంచి పాతబస్తీకి అడుగు పెట్టడంతోటే రహదారుల దుస్థితి కళ్లకు కట్టినట్లుగా ఉంటుంది. దేశవిదేశాల నుంచి పర్యాటకులు వచ్చే చార్మినార్, మక్కామసీదుతో పాటు చౌమహల్లా ప్యాలెస్, చుడీబజార్, ఫలక్‌నుమా ప్యాలెస్, జూపార్క్ తదితర ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
పట్టిపీడిస్తోన్న సమస్యలు...
పాతబస్తీలో ప్రజలను పట్టి పీడించే సమస్య పారిశుద్ధ్యం. రోడ్ల పక్కన ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. రోడ్ల మరమ్మతుల కోసం తవ్విన గోతుల్లో పడి అనేక మంది ప్రజలు గాయాలపాలవుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం నిర్మించతలపెట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణం ఏళ్లుగా కొనసాగుతోంది. పర్యవసానంగా ప్రయాణ సమయంలో ప్రజలు నానా ఇబ్బందుల పడుతున్నారు. పాతబస్తీకి వెంటనే మెట్రోరైలు తీసుకురాలేకపోయినా వారసత్వ నగరంగా పేరున్న
సదుపాయాలు కల్పించండి...
నగరంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా పర్యాటకంగా అభివృద్ధి చెందే విధంగా చూడాలని కోరుతున్నారు. మౌళిక సదుపాయాల కోసం ప్రయత్నాలు జరగడం లేదని స్థానికులు వాపోతున్నారు. చారిత్రక నగరంగా పేరున్న దృష్ట్యా చారిత్రక సంపదకు ఊతం ఇచ్చే విధంగానే సదుపాయాలు కల్పించాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'బస్తీ కోసం బరిలోకి దిగిన క్యాబ్ డ్రైవర్ భార్య'