మూసీ పరివాహక ప్రాంతంలోని చెరువుల్లో విపరీతంగా గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలు పెరుగుతుండటంతో... నిర్వహణ, చేపల పెంపకంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. అసలే కాలుష్యం... ఆపై ఏ చెరువులో చూసినా... గుర్రపు డెక్క విస్తరిస్తుండటంతో చేపల్లో ఎదుగుదల లోపిస్తోంది. దీంతో మత్స్యకారులు, రైతులు పడుతున్న కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోంది.
గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నప్పటికీ... ఆ ఫలితం లబ్ధిదారులకు దక్కడం లేదు. ఉపాధి కొరవడంతో కొంత మంది మత్స్యకారులు వలసబాట పట్టి నగరంలో కూలీలుగా మారుతున్నారు. చేపల పెంపకమే జీవనాధారంగా బ్రతుకుతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని , యంత్రాల సాయంతో గుర్రపు డెక్క తొలగించాలని మత్స్యకారులు కోరారు.
ఒకప్పుడు పరిశుభ్రమైన నీరు ప్రవహించిన ఈ నదిలో క్రమేణా పారిశ్రామిక వ్యర్థాలు కలిసిపోయి పూర్తిగా కలుషితమైంది. వ్యవసాయ అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రసాయన అవశేషాలతో కూడిన దుర్గంధమైన మురుగు నీరు కావడంతో మత్స్యకారులు ఈ గుర్రపు డెక్కను తొలగించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. చెరువుల్లో దిగిన మత్స్యకారులను చర్మ సంబంధిత వ్యాధులు వేధిస్తున్నాయి. ఏటా ఇదే తంతు నెలకొనడంతో తాము ఆర్ధికంగా నష్టపోతున్నామంటున్నారు మత్స్యకారులు. ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లను అందించినా..దాని ఫలితాన్ని పొందలేకపోతున్నామని వాపోతున్నారు.
ప్రభుత్వం సబ్సిడీ మీద యంత్రాలను అందించి, గుర్రపు డెక్కను తొలగించే ఏర్పాట్లు చేస్తే తమకు కొంత ఆసరాగా ఉంటుందంటున్నారు. మత్స్యకారుల శ్రేయస్సు దృష్ట్యా ఆధునిక పరిజ్ఞానం, యంత్రపరికరాల సాయంతో చెరువుల్లో గుర్రపుడెక్క తొలగించాలన్న డిమాండ్లు సామాజిక కార్యకర్తల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం స్పందించి మూసీ నది ప్రక్షాళన చేపట్టి తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.