మానవ జాతికి గౌరవాన్ని ఆపాదించే ధర్మాల్లో గృహస్థాశ్రమ ధర్మం ప్రధానమైనది. దానికి ప్రాతిపదిక ఏకపత్నీ వ్రతం, పాతివ్రత్యం. ఈ సుగుణాల ప్రాధాన్యాన్ని సీతారాములు నిరూపించారు. అందుకే కదా తెలుగువారిపెళ్లి శుభలేఖల్లో తప్పనిసరిగా ‘జానక్యా కమలామలాంజలి పుటే ..’అనే శ్లోకం ఉంటుంది. అంతే కాదు, ‘ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవృ’ అన్నది కూడా అంతగా ప్రశస్తి పొందింది. సీత వెంట ఉంటే రాముడు ధర్మం తప్పడని దానికి అర్థం.
మునుల్ని ఇబ్బంది పెడుతున్న రాక్షసుల్ని సంహరిస్తానని అతడు చెప్పినప్పుడు ధర్మమార్గం తప్పుతున్నాడేమోనని సందేహపడుతుందామె. దానికి అతడు ఇవన్నీ మగవారి విషయాలు నీకెందుకు అనలేదు. కారణాలను వివరించాడు. ఈ తీరు ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువనివ్వాలనే విషయం చెబుతోంది.
సీతారాములది ఆదర్శ దాంపత్యం. రెండు శరీరాలు, ఒకటే ఆత్మ. ఇదే సనాతన ధర్మంలో వివాహ సంస్కార ప్రయోజనం. ఇద్దరిదీ ఒకే అభిప్రాయం. ఒకరికి చెబితే రెండో వారికి చెప్పవలసిన అవసరం లేదు. అరణ్యవాసం చేయాలని కైకేయి కోరింది రాముణ్ని మాత్రమే. తనూ వస్తానంటూ అని జానకీ బయల్దేరింది. రాముడు వద్దన్నాడు. అప్పుడు సీత రాముణ్ని ఒప్పించటానికి సామ దాన భేద ఉపాయాలు ప్రయోగించింది. చివరికి ‘పురుష రూపంలో ఉన్న స్త్రీ అని తెలియక మా నాన్న నన్ను నీకిచ్చినందుకు సంతోషపడుతున్నాడు’ అని ఉక్రోషంతో అన్నమాట సామాన్యులెవరికైనా కోపం తెప్పిస్తుంది. కానీ సీత మనసెరిగిన రాముడు అది తనని వదిలి ఉండలేక అన్నదే కాని మరొక ఉద్దేశంతో కాదు అని అర్థం చేసుకున్నాడు కాబట్టే సరేనన్నాడు. భార్యాభర్తలెవరైనా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సాగిపోవాలని వారు అనుసరించి చూపించారు.
వనవాసంలో సీత ఏ మాత్రం బాధ పడినట్టు కనపడదు. నీతో ఉంటే అరణ్యమే అయోధ్య అని అన్నమాట నిజమేనని నిరూపించింది. రాముడు కూడా సీత ఏం చెబితే అది చేశాడు. లేకపోతే బంగారు లేడి ఉండదు, అది రాక్షస మాయ అయి ఉంటుందని లక్ష్మణుడు చెప్పినా సీత కోరిక తీర్చాలని అనుకున్నాడు. సీత వియోగంతో రాముడు విలపించిన తీరు ఎవరి గుండెల్నైనా పిండేయక తప్పదు. తన భార్యని అపహరించినందుకు రావణుడి జాతి నంతటినీ అంతం చేశాడు.
సీతారాముల అనుబంధం సుందరకాండలో బాగా తెలుస్తుంది. ముఖ్యంగా హనుమ మాటల్లో. సీతావియోగంతో రాముడు నిద్రాహారాలు లేకుండా ఉన్నాడని, రుచికరమైన పదార్థాలు చూడగానే సీత గుర్తు రావటంతో బాధపడుతున్నాడనీ, క్షణ మాత్రం నిద్ర పట్టినా సీతా అని కలవరిస్తూ మేలుకుంటాడని, శరీరం మీద కీటకాలు వాలినా తెలియ కుండా సీత స్మరణలో గడుపుతున్నాడని చెబుతాడు. సీత రాముణ్నే తలచుకుంటూ నిద్రాహారాలు లేకుండా ఉన్న సంగతి హనుమ ప్రత్యక్షంగానే చూశాడు. తనని ఎన్ని మాటలు అన్నా భరించిన సీత రాముణ్ని గురించి చులకనగా మాట్లాడగానే తోక తొక్కిన త్రాచులాగా మారింది. ఇవన్నీ భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి ఉండాల్సిన ప్రేమను సూచిస్తాయి. 12 సంవత్సరాలు హాయిగా అంతఃపురంలో సకల భోగాలు అనుభవించి, 13 సంవత్సరాలు వనవిహారం చేసి, 10 నెలలు వియోగం అనుభవించి, పదివేల సంవత్సరాలు రాజభోగాలు అనుభవించి గృహస్థాశ్రమ ధర్మానికి ఆదర్శంగా నిలిచారు సీతారాములు. వారి కల్యాణం...లోక కల్యాణం.
- డా. అనంతలక్ష్మి