కంటికి కనిపించని మహమ్మారి సృష్టించిన భయంతో ప్రపంచమంతా ఇంటికి బందీ అయింది. బాధితులు త్వరగా కోలుకునేందుకు మనోధైర్యమే ఔషధమవుతోన్న ఈ పరిస్థితుల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాల్సిన తరుణమిది. వైరస్‌కు ఎదురొడ్డి ముందువరసలో పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు బాసటగా నిలవాలి.. కొవిడ్ బాధితులకు తమవంతు సహాయం అందించి మనోధైర్యం కల్పిస్తే వారు విజేతలై నిలవగలుగుతారు.
గెలుద్దాం.. గెలిపిద్దాం..!
నగరంలో వైరస్ బారిన పడినవారిలో కొందరు ఆందోళనతో ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడ్డం అందరినీ కలచివేసింది. వైరస్‌ను జయించేందుకు మనమిచ్చే మనోధైర్యమే మందని గుర్తించాలి..వారు కోలుకునేందుకు సహకరించాలి. నగర యువత ఇప్పటికే బాధితులకు కావాల్సిన సామగ్రి సరఫరా చేయడం, ప్లాస్మా దానం వంటి సేవలతో ముందుంది. దీనిని మరింతమంది అందిపుచ్చుకోవాల్సి ఉంది.
అపార్టుమెంట్లు ఓ అడుగు ముందే..
కరోనా బాధితులకు అందించే సాయంలో అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఓ అడుగు ముందే ఉన్నాయి. పొరుగిళ్లలో పాజిటివ్ వచ్చినవారు కోలుకునేదాకా ఆహారం, అవసరమైన ఔషధాలు అందిస్తున్నాయి. కొవిడ్ నుంచి కోలుకున్నవారికి సన్మానాలు చేస్తున్నారు. ఇది అంతటా వెల్లివెరియాలి.
ప్రకృతిహిత పతాకాలు!
వేడుకలు అయిపోగానే ప్లాస్టిక్ జెండాలు ఎక్కడికక్కడా పడేయడం చూస్తున్నాం. అవి పర్యావరణానికి ఇబ్బందికరం, జెండాకూ అగౌరవం కూడా. నగరానికి చెందిన ‘ప్లాన్ ఏ ప్లాంట్’ సంస్థ ‘సీడ్ ఫ్లాగ్’ ఆవిష్కరణతో ముందుకొచ్చింది. కాగితంతో చేసిన జెండాలకు విత్తనాలను అతికించి అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని పడేయకుండా ఓ కుండీలో పెట్టడం వల్ల మొక్క పెరిగి ఇటు హరిత స్ఫూర్తి, అటు మువ్వన్నెల పతాకానికీ గౌరవం దక్కుతుందంటున్నారు సంస్థ సంచాలకులు దివ్యాంజని.