భయం తొలగించు.. బొజ్జ గణేశా
కరోనాతో వేల మంది ఆసుపత్రుల పాలవగా.. వరద తగ్గగానే పారిశుద్ధ్య సమస్యలు అనారోగ్య హేతువులు కానున్నాయి. 121 వైద్య శిబిరాల ద్వారా సేవలు సాగుతున్నాయి. ఇంటింటి వైద్యపరీక్షలు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలూ సమర్థంగా సాగేలా చూడు. ఆయురారోగ్యాలు ఇవ్వు.. విఘ్ననాథా.
ఏకమయ్యే వరమివ్వు.. ఏకదంతా
ఊరంతా ఒక్కటై.. ఐకమత్యంతో చేసుకునే వినాయక ఉత్సవాలను కరోనా దూరం చేసింది. జిల్లా అంతటా వేలాది చలువ పందిళ్లతో.. సదా నీ స్మరణతో ఆనందోత్సాహాలు వెల్లివిరిసేవి. ఆరు నెలలుగా కరోనా వై‘రష్’తో ఆంక్షల వేళ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అందరూ ఏకమై సాగే రోజులు మళ్లీ ఇచ్చేయి సామీ.
పద్ధతి నేర్పు.. ప్రమద గణాధిప
కరోనా వ్యాప్తికి స్వయంకృతమే కారణం. భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత, మాస్కుల ధారణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. మరికొన్నిచోట్ల పాజిటివ్ కేసుల గుర్తింపు, తరలింపులో జాప్యమూ వ్యాప్తికి దోహదం అవుతోంది. ప్రజలు చైతన్యులై స్వీయ నియంత్రణతో సాగేలా, అధికారులు బాధ్యతగా ఉండేలా చూడు దేవా.
స్థైర్యం కూర్చు.. సిద్ధి వినాయక
కరోనాపై యుద్ధంలో వైద్యులు, పోలీసులు, కీలక శాఖల అధికారులు, వారి సహాయకులు, పారిశుద్ధ్య కార్మికులున్నారు. వీరిలో కొందరు వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారిని క్షేమంగా ఉంచి.. కరోనాను జయించే శక్తినివ్వు.. వాళ్లు బాగుంటే మేమూ బాగుంటామయ్యా.
ఉపాధి చూపు.. ఉమాసుతా
కరోనాతో ఉపాధి కరవైంది. వ్యాపారం గగనమైంది. ఇంటి ఖర్చులకూ కష్టమైంది. అన్ని రకాల కార్మికులు 10 లక్షల మంది... చిరు వ్యాపారులు ఏడు లక్షల మంది ఉన్నారు. అంతా ప్రస్తుత సంక్షోభంతో నష్టపోయారు. వీరందరూ కోలుకునేలా పూర్వవైభవం తేవాలి ప్రభూ.
అక్షరం ప్రాప్తించు.. ఆద్య పూజిత
నీ స్మరణతోనే.. అక్షర శ్రీకారం. నేడేమో పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్నీ సెలవే. ప్రాథమికం నుంచి ఉన్నతవిద్య వరకు 20 లక్షల మందిపైనే విద్యార్థులున్నారు. ఆన్‌లైన్ క్లాసులకు శ్రీకారం చుట్టినా ప్రతి ఒక్కరు మెరవాలంటే అడ్డంకులు నీవే తీర్చాలి.
గంగమ్మకు చెప్పు.. గజాననా
26 మండలాల్లో 173 గ్రామాలు వరదకు ప్రభావితమయ్యాయి. 82 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పీడిత ప్రజలు లక్ష మందిపైనే. వేల మంది.. ఇళ్లు, ఆస్తులు వదిలేసి పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటున్నారు. కకావికలమైన తూర్పున శాంతించమని గంగమ్మకు చెప్పు గణపయ్యా.
మనసారా ఆదుకో.. మహిమాన్వితా
ఆరుగాలం రైతు కష్టం వరదల్లో కొట్టుకుపోయింది. తక్షణం పరిహారంతోనే కాసింత ఊరట. అదేదో నీవే ఇప్పించాలి. ఆరు నెలలుగా సంక్షోభం.. తాజాగా ఆంక్షలు సడలించినా వ్యవసాయ, ఉపాధి పనులపై అపార ప్రభావం. అన్నం పెట్టే 7.5 లక్షల మంది రైతన్నలను మనసుపెట్టి ఆదుకోవాలయ్యా.
లంకలను కరుణించు.. లంబోదరా
లంకల్లో తిండిలేక.. నీరులేక.. విద్యుత్తు లేక.. రాకపోకలూ కష్టమాయె. ప్రజాప్రతినిధులు మనసు పెట్టి ఆదుకుంటేనే చక్కబడేది. అధికారులు కొంత మేర చక్కదిద్దుతున్నారు. కరోనా భయంతో పునరావాసాలకు వెళ్లలేక ఇళ్ల దగ్గర, కొండలపై ఉన్నోళ్లని కరుణించు సామీ.
ఇదీ చూడండి :ధన్వంతరి నారాయణుడి రూపంలో ఖైరతాబాద్ గణపయ్య